దోమకొండ: కఠోర సాధన, లక్ష్యంపై అంచంచలమైన ఏకాగ్రతతో దోమకొండ ప్రాంతానికి చెందిన యువ ఆర్చర్లు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రతిభ చాటుతూ వరుస పతకాలు సాధిస్తున్నారు. విల్లు చేతబట్టి గురిని ఛేదిస్తున్న క్రీడాకారులు జిల్లాకు మంచిపేరు తీసుకొస్తున్నారు.
ఆర్చరీ ఆటకు దోమకొండ కేరాఫ్‌గా మారింది. గడీకోట మైదానంలో సంస్థాన వారసులైన కామినేని అనిల్‌కుమార్ 2007లో ఏర్పాటు చేసిన ఆర్చరీ అకడమీ విలువిద్యకు తోడ్పాటునందిస్తోంది. ఇక్కడ ఉచిత శిక్షణతో విలువిద్య క్రీడలో దోమకొండ విద్యార్థులు రాణిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆర్చరీ శిక్షకుడు ప్రతాప్‌దాస్ శిక్షణలో మెలకువలు నేర్చుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ పతకాలు సాధిస్తున్నారు. ఓ వైపు చదువుతూనే నిత్యం నాలుగు గంటల సాధన చేస్తున్నారు. 19 ఏళ్లుగా ఇక్కడ ఎంతోమంది ఆర్చరీలో రాణించి పలు పతకాలు సాధించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆర్చరీలో రాణించి తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చారు. దోమకొండతో పాటు భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి మండలాలకు చెందిన పలు గ్రామాల విద్యార్థులతో పాటు కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు సైతం ఇక్కడికి వచ్చి విలువిద్య నేర్చుకుంటున్నారు.
40 మందితో మొదలై 550 మందితో..
2007లో ఇక్కడ 40 మంది విద్యార్థులతో మొదలైన ఆర్చరీ ప్రస్తుతం 550 మందికి చేరిందని ఆర్చరీ కోచ్ ప్రతాప్‌దాస్ తెలిపారు. కామినేని అనిల్‌కుమార్ ఉచితంగా సొంత డబ్బులతో ఆర్చరీ మెటీరియల్ అందించి వారికి శిక్షణ ఇప్పిస్తున్నారు. దోమకొండ, కాచాపూర్, పెద్దమల్లారెడ్డి, బీబీపేట, ఫరీద్‌పేట, పాల్వంచ, భిక్కనూరు, రామేశ్వర్‌పల్లి, జంగంపల్లి, కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులు కొన్నేళ్లుగా ఇక్కడికి ఆర్చరీ శిక్షణ కోసం వస్తున్నారు. దీంతో ఆర్చరీ ఆట అంటేనే దోమకొండ అనే విధంగా తయారైంది.
జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో
రాణిస్తున్న దోమకొండ క్రీడాకారులు
కఠోర సాధనతో విజయాల బాటలో దూసుకెళ్తున్న ప్రతిభావంతులు
వరుస విజయాలతో అందరి
ప్రశంసలు అందుకుంటున్న ఆర్చర్లు


