భరోసా ఎక్కడ..? | - | Sakshi
Sakshi News home page

భరోసా ఎక్కడ..?

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

ప్లే స్కూళ్లలో

మూడేళ్ల లోపు పిల్లలకూ అడ్మిషన్లు

అనుమతులు లేకుండానే ఏర్పాటు

జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా

వెలుస్తున్న వైనం

ఖలీల్‌వాడి: విద్యాశాఖ అనుమతులు లేకుండానే నిజామాబాద్‌ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్లే స్కూల్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇవి నడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. యాజమాన్యాలు చెప్పినంత ఫీజులు తల్లి దండ్రులు చెల్లిస్తున్నా పిల్లల భద్రతకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారో చెప్పడం లేదు. ఒక్కో పాఠశాలలో సుమారు 50 నుంచి 100 మంది చిన్నారులను చేర్చుకొని, వారి అలనా పాలన చూసేందుకు కేవలం ఇద్దరు లేదా నలుగురు టీచర్లను, ఆయాలను నియమించి వదిలేస్తున్నారు.

నిబంధనలకు నీళ్లు...

2010 ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ ప్రకారం ఈ ప్లే స్కూల్స్‌ అనుమతి తీసుకొని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్లేస్కూళ్ల యాజామాన్యాలు ఎక్కడ ఇలాంటి నిబంధన పాటించడం లేదు. పిల్లలకు మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే ప్లే స్కూల్‌లో చేర్చుకోవడం ఎన్సీపీసీఆర్‌ నిబంధనలకు వ్యతిరేకం. అయినప్పటీకి కొన్ని యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.

2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే జిల్లాలో కొత్తగా ప్లే స్కూళ్లు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. నిజామాబాద్‌ నగరంలో పదుల సంఖ్యలో ప్లేస్కూళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టడం లేదంటున్నారు. కొన్ని ప్లే స్కూళ్లలో తల్లిదండ్రులను ఆకర్షించేందుకు బిల్డింగ్‌కు రంగురంగుల బొమ్మలు వేసి, అక్కడ పిల్లలకు ఆట వస్తువులను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో ఫీజు వసూళ్లు చేస్తున్నారు. కొన్ని ప్లేస్కూళ్ల యాజమాన్యాలు ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పేరిట ప్రచారం చేసి అడ్మిషన్లు చేస్తున్నారు. ఆడ్మిషన్‌ ఫీజుతోపాటు ఏడాది ఫీజును గంపగుత్తగా రూ. 50 వేల నుంచి రూ. 80 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అనుమతులు లేని ప్లేస్కూళ్లపై చర్యలు

ప్రభుత్వ నిబంధనలు లేకుండా నడిచే ప్లేస్కూళ్లపై డీఈవో అనుమతితో తనిఖీలు చేసి నోటీసులు అందించి చర్యలు తీసుకుంటాం. ప్లేస్కూళ్లు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉండాలి. ఆపార్ట్‌మెంట్‌లు, ఫస్ట్‌ ఫోర్లులో పెట్టొద్దు. ప్రభుత్వం జిల్లాలో 112 ప్లేస్కూళ్లను ఏర్పాటు చేసింది. అందులో పిల్లలకు ఆడ్మిషన్లు తీసుకోవాలి.

సాయారెడ్డి, సౌత్‌ ఎంఈవో, నిజామాబాద్‌

సీసీ కెమెరాలు..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్లే స్కూళ్లను గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్ని యాజమాన్యాలు అపార్ట్‌మెంట్లలో లేదా ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేస్తున్నాయి. దీంతోపాటు స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్లే స్కూళ్లలో సౌకర్యాలు చూడకుండానే తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలాంటి సదుపాయాలు లేని పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా తప్పనిసరిగా ప్రమాణాలు పాటించే పాఠశాలలకే అనుమతులు మంజూరు చేసేలా, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement