అభివృద్ధి అంతంతే! | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి అంతంతే!

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

బోధన్‌టౌన్‌(బోధన్‌): నిజాం చక్కెర కర్మాగారం ఉన్నంత కాలం ఓ వెలుగు వెలిగిన బోధన్‌ పట్టణం నేడు అరకొర అభివృద్ధితో ముందుకు సాగుతోంది. 1956లో మున్సిపాలిటీగా ఏర్పడి ప్రస్తుతం గ్రేడ్‌ –2 స్థాయికి ఎదిగింది. బోధన్‌లో 16 ఏళ్ల క్రితం నర్సింగ్‌ కళాశాల ఏర్పాటైంది. ఇప్పటి వరకు సొంత భవనానికి మోక్షం లభించలేదు. అప్పటి మాజీ మంత్రి, ఇప్పటి ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి చొరవతో నర్సింగ్‌ కళాశాల బోధన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు ఆస్పత్రిలోని నాలుగు గదుల్లో నడుస్తోంది. అరకొర వసతులతో విద్యార్థులు చదువుకుంటున్నారు. వసతి గృహం లేక పోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే చొరవతో నర్సింగ్‌ పాఠశాలకు సొంత భవనం ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడ్డాయి. పాఠశాల భవన నిర్మాణం కోసం స్థల పరిశీలనతో పాటు రూ. 21 కోట్లు మంజూరు అయ్యాయి.

ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌..

బోధన్‌ పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం సీఐ, సిబ్బందిని నియమించారు. అయితే ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ లేక పోవడంతో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లోనే కొనసాగుతోంది. స్థల సేకరణ చేసి సొంత భవనం నిర్మాణం జరిగేలా చర్యలు చేపట్టాల్సిన అసవరం ఉంది. పట్టణంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌తో పాటు, సీసీఎస్‌ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు పంపిన ప్రతిపాదలకు మోక్షం లేదు.

మున్సిపాలిటీకి..

బోధన్‌ మున్సిపాలిటీ 1956లో ఏర్పాటయ్యింది. ప్రస్తుతం మున్సిపాలిటీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రతి వర్షాకాలంలో భవనం లీకేజీలు అవుతున్నాయి. అధికారులు మరమ్మతులు చేసి నెట్టుకొస్తున్నారు. నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

వంద పడకలకే పరిమితం

బోధన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ అయ్యి పదేళ్లు గడుస్తోంది. 100 పడకల ఆస్పతిగానే కొనసాగుతోంది. ఈ ఆస్పత్రికి బోధన్‌ పట్టణం, బోధన్‌ మండలంతో పాటు ఇతర చుట్టు పక్కల ఏడు మండలాల ప్రజలు, మహారాష్ట్ర నుంచి సైతం ప్రజలు చికిత్స కోసం వస్తుంటారు. ప్రతి రోజు ఓపీ 500 నుంచి 700 వరకు నమోదవుతుంది. ఈ ఆస్పత్రికి స్థల సేకరణ చేసి నూతన భవనాన్ని నిర్మించాలని, అప్‌గ్రేడ్‌చేసి మరో 50 పడకలను పెంచాల్సిన అసవరం ఉంది. అలాగే స్కానింగ్‌ సెంటర్‌, ఇతర వసతులు కల్పించి, గైనిక్‌ విభానికి ఓ భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఒకప్పుడు వెలుగు వెలిగిన

బోధన్‌ పట్టణం

నిజాం షుగర్స్‌ లేఆఫ్‌తో

మసకబారిందా..

జిల్లా ఆస్పత్రికి నూతన భవనం ఎప్పుడో..

లీకేజీలమయం మున్సిపాలిటీ భవనం

నాలుగు గదుల్లోనే నర్సింగ్‌ కళాశాల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement