● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
సుదర్శన్ రెడ్డి
● వీడియో కాన్ఫరెన్స్‌లో
జిల్లా కలెక్టర్లకు సూచన
నిజామాబాద్ అర్బన్: ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమగ్రంగా, పారదర్శకంగా రూపొందించేందుకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ –2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బూత్ లెవల్ ఆఫీసర్లు, బూత్ లెవల్ ఏజెంట్లకు ఈ నెల 24లోగా శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 25 నుంచి బీఎల్‌వోలు తమ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురించే వరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాల ని సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఈవో దష్టికి తెచ్చారు. ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్‌వోలు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రీ మ్యాపింగ్ 87 శాతం పూర్తయ్యిందని తెలిపారు. 1565 పోలింగ్ కేంద్రాల పరిధిలో రాజకీయ పార్టీలు బీఎల్‌ఏ ల నియామకాలు పూర్తి చేశాయని, వారికి ఐడీ కార్డులు సమకూర్చాల్సిందిగా సూచించామన్నారు. జిల్లాకు బీఎల్‌వో కిట్లు కేటాయించాలని సీఈవోను కోరారు. అదనపు కలెక్టర్ భుజంగ రావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్‌వోలు పాల్గొన్నారు.
వీసీలో మాట్లాడుతున్న సుదర్శన్‌రెడ్డి


