నారీ శక్తి..! | - | Sakshi
Sakshi News home page

నారీ శక్తి..!

Jun 17 2026 5:33 AM | Updated on Jun 17 2026 5:33 AM

ఉపాధిలో
కూలీల్లో 67 శాతం మహిళలే

చెరువుల పూడికతీత పనుల్లో చెమటోడుస్తున్న వైనం

వృద్ధాప్యంలోనూ తగ్గని అవ్వల ఉత్సాహం

పారతో చెరువు మట్టిని తవ్వుతున్న వయసు పైబడిన మహిళ

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): పల్లెల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వేసవికాలం కావడంతో అధికారులు కూలీలతో గ్రామాల్లోని చెరువులు, కుంటల పూడికతీత పనులు చేయిస్తున్నారు. అయితే, ఈ పనుల్లో పురుషుల కన్నా మహిళా కూలీలే అత్యధికంగా పాల్గొంటూ రికార్డు సృష్టిస్తున్నారు. ఎండలో చెమటోడుస్తూ కష్టమైన పనులను తాము సైతం చేయగలమని నిరూపిస్తున్నారు. చెరువుల్లో గట్టిపడిన మట్టిని పారతో తవ్వడం, తట్టలతో మోయడం, ట్రాక్టర్లలో నింపడం వంటి పనులకు ఎంతో శారీరక శ్రమ అవసరం అవుతుంది. అలాంటి కష్టమైన పనులను మహిళలు ఎంతో ఓపికతో చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న పనుల్లో 67 శాతం మంది మహిళలే ఉండడం విశే షం. పనుల వద్ద ఎటు చూసినా మహిళా కూలీల సందడే కనిపిస్తోంది. ఇటు పురుషుల సంఖ్య కేవలం 33 శాతానికే పరిమితమైంది. అదే విధంగా ఈ పనుల్లో మధ్య వయస్కులతోపాటు వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్న అవ్వలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ‘‘ఈ వయసులో ఇంట్లో కూర్చోకుండా పనికి ఎందుకు వస్తున్నావని’’ అడిగితే... రెక్కలు ఆడినన్ని రోజులు పని చేసుకొని బతుకుతామని నమ్మకంగా చెబుతున్నారు. ఎండలు మండుతున్నా లెక్క చేయకుండా వారు చూపిస్తున్న ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంటోంది. సొంత ఊరిలోనే పని దొరకడం, వస్తున్న డబ్బులు తమ కుటుంబ ఖర్చులకు, పిల్లల చదువులకు ఎంతో ఆసరాగా ఉంటున్నాయని మహిళా కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నారీమణులు పలుగు పార చేతపట్టి ‘ఉపాధి’బాట పడుతున్నారు. ఇంట్లో గరిటె తప్పిడమే కాదు.. పురుషులతో పోటీపడుతూ ఎండలో చెమటోడ్చి పనులు చేస్తున్నారు. జిల్లాలో ఉపాధిహామీ పనులకు హాజరవుతున్న మొత్తం కూలీల్లో 67శాతం మంది మహిళలే ఉంటున్నారు. వృద్ధ మహిళలూ పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. రెక్కలు ఆడినన్ని రోజులు పని చేస్తామంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement