విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి

Jun 17 2026 5:33 AM | Updated on Jun 17 2026 5:33 AM

కామన్‌ డైట్‌మెనూను అనుసరించాలి

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశం

సుద్దపల్లి బాలికల గురుకులం సందర్శన

తెయూ(డిచ్‌పల్లి): ప్రభుత్వం నిర్దేశించిన కామన్‌ డైట్‌ మెనూను అనుసరిస్తూ విద్యార్థులకు పరిశుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. కిచెన్‌, డార్మెటరీ, డైనింగ్‌ హాల్‌ను పరిశీలించారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు పూర్తి స్థాయిలో వచ్చాయా అని ఆరా తీశారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా పరిసరాలతోపాటు కిచెన్‌, డైనింగ్‌ హాల్‌లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు, సంరక్షకులు వస్తేనే పంపించాలని సూచించారు. ఎక్కువ రోజులపాటు పాఠశాలకు హాజరు కాని విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎందుకు పాఠశాలకు రావడం లేదని ఆరా తీయాలన్నారు. డ్రైనేజీ పనులను తక్షణమే చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం సెకండియర్‌ క్లాస్‌ రూమ్‌ కు వెళ్లి వారితో ముచ్చటించారు. విద్యార్థినులకు పలు సబ్జెక్టులలో ప్రశ్నలు వేస్తూ, సమాధానాలు ఇచ్చిన వారికి బహుమతులు అందజేశారు. చక్కగా చదువుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ స్వప్న, పాఠశాల సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement