అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్టు
● కేజీ వెండి, 5 తులాల బంగారం స్వాధీనం
బోధన్‌టౌన్(బోధన్): అంతర్రాష్ట్ర దొంగల ముఠా లోని ఓ సభ్యుడిని అరెస్టు చేసినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గత డిసెంబర్ 21న బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గల రెండు బంగారు దుకాణాల్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. చోరీకి పాల్పడిన నలుగురు ముఠా సభ్యులలో ఇద్దరిని ఈ నెల 11న పోలీసులు అరెస్టు చేశారు. కాగా, మరో నిందితుడు మహ్మద్ మాలాసాబ్ షేక్‌ను ఎస్‌హెచ్‌వో వెంకట్‌నారాయణ బృందంలోని పోలీసు సిబ్బంది బుధవారం అర్ధరాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. నిందితుడి నుంచి కేజీ వెండితోపాటు ఐదు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సాగర్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఏసీపీ తెలిపారు. కేసు దర్యాప్తులో సహకరించిన మహారాష్ట్రలోని కొండల్‌వాడీ ఎస్‌హెచ్‌వో షిండే, ఉమ్రి ఎస్‌హెచ్‌వో జయప్రకాష్ గూఠేలకు ధన్యవాదాలు తెలిపారు. దర్యాప్తు బృందం ఎస్సై మనోజ్, ఏఎస్సై బాబూరావ్, సిబ్బంది రవి, మహేశ్, సాయికుమార్‌ను అభినందించారు. సమావేశంలో సీఐ, ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.


