లింగాకర్షక బుట్టలు ఉపయోగకరం
బోధన్: వరిలో కాండం తొలిచే పురుగు ఉద్ధృతి గమనించేందుకు, నియంత్రణకు లింగాకర్షక బుట్టలు ఎంతో ఉపయోగకరమని రుద్రూర్ ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త బృందం రైతులకు సూచించారు. పరిశోధన కేంద్రం దత్తత తీసుకున్న సాలూర మండలం హున్సా గ్రామ శివారులో వరి, శనగ పంటను గురువారం సందర్శించారు. 10 మంది రైతులకు లింగాకర్షక బుట్టలను పంపిణీ చేశారు. వరి నాట్లు వేసిన తర్వాత 15 రోజుల నుంచి ఎకరానికి 5 నుంచి 6 వరకు లింగాకర్షక బుట్టలను ఒక అడుగు ఎత్తులో అమర్చుకొని పురుగు ఉద్ధృతిని గమనించాలని తెలిపారు. బుట్టలో అమర్చుకున్న రబ్బర్ ల్యూర్‌ను 30 నుంచి 40 రోజులకోసారి మార్చుకోవాలని సూచించారు. లింగాకర్షక బుట్టలో రోజుకు 5 నుంచి 6 పురుగులు వరుసగా మూడు రోజులు పడితే, నివారణకు రసాయన మందులు ఉపయోగించాలన్నారు. దత్తత గ్రామం ఇంచార్జి, శాస్త్రవేత్తలు డాక్టర్ రమ్య రాథోడ్, సమత పరమేశ్వరి, సాయి చరణ్, డాక్టర్ చంద్రకళ, సర్పంచ్ మర్కల్ శివకుమార్, ఉపసర్పంచ్ నగేష్, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, సొసైటీ మాజీ చైర్మన్ మందర్న రవి, రైతులు పాల్గొన్నారు.


