అడవిలో జంతు గణన
తేలనున్న జంతువుల సంఖ్య
● మాంసాహార జంతు గణన పూర్తి
● శాకాహార జంతు గణన ప్రారంభం
● కమ్మర్‌పల్లి అటవీ క్షేత్ర పరిధిలో
14వేల హెక్టార్లు
కమ్మర్‌పల్లి: నాలుగేళ్లకోసారి నిర్వహించే ఆలిండియా టైగర్ ప్రతిపాదనలను జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో అధికారులు ముమ్మరంగా అమలు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో జంతువుల లెక్క తేల్చడానికి మూడు రోజుల క్రితం ప్రారంభమైన జంతు గణన కార్యక్రమం కమ్మర్‌పల్లి అటవీ క్షేత్ర పరిధిలో కొనసాగుతోంది. 14 వేల హెక్టార్ల విస్తీర్ణం కలిగిన కమ్మర్‌పల్లి అటవీ క్షేత్ర పరిధిలో 17 టీంలను అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో ముగ్గురు చొప్పున 51 మంది సిబ్బందిని నియమించారు. అటవీ శాఖ అధికారులకు దీనిపై ఇప్పటికే శిక్షణ సైతం ఇచ్చారు. అటవీ జంతువులను గుర్తించడానికి దేశ వ్యాప్తంగా జంతుగణన సర్వేను ఆన్‌లైన్ పద్ధతిలో ప్రారంభించారు. సర్వేలో మాంసాహార, శాకాహార జంతువుల వివరాలను గుర్తిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన జంతువుల వివరాలను అటవీ శాఖ రూపొందించిన ఎంస్ట్రిప్స్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. సర్వే ద్వారా గతంలో కంటే జంతువుల సంఖ్య తగ్గిందా, పెరిగిందా అనే వివరాలు తెలియనున్నాయి.
10 కెమెరాల ఏర్పాటు..
సర్వే ద్వారా అటవీ ప్రాంతాల్లోని జంతువుల లెక్క పక్కాగా తెలియనుంది. అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి. గతంలో కంటే ఎక్కువగా ఉన్నాయా లేక తగ్గిపోయాయా అనే విషయాలు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. జంతువుల లెక్క పక్కాగా తెలియడానికి అటవీశాఖ ఆధ్వర్యంలో 10 ట్రాప్ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. గతంలో చేసిన సర్వే ప్రకారం జిల్లాలో 25 రకాల జంతువులు ఉన్నట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. శాకాహార, మాంసాహార జంతువుల లెక్క తెలిసిన తర్వాత పులి జీవించడానికి అనువైన స్థలంగా ఉంటుందా లేదా అనేది కూడా తెలియడానికి అవకాశం ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
సర్వే ఇలా..
అటవీ ప్రాంతంలో మాంసాహార, శాకాహార జంతువుల సర్వేను వేర్వేరుగా చేపట్టారు. మొదట మాంసాహార జంతువులపై మూడు రోజులపాటు సర్వే చేపట్టి పూర్తి చేశారు. చిరుత, పులి, ఎలుగుబంటి, తోడేలు, నక్క, అడవి కుక్క, అడవి పంది తదితర జంతువుల వివరాలను సేకరించారు. ఉదయం 6 గంటలకు ఐదు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి వణ్యప్రాణుల సంచారాన్ని గుర్తించారు. మాంసాహార జంతువులకు సంబంధించిన కాలి గుర్తులతో పాటు, మలవిసర్జనను(పేడ) సేకరించారు. శుక్రవారం ప్రారంభమైన శాకాహార జంతువుల సర్వే మూడు రోజుల పాటు కొనసాగనుంది. మనుబోతు, సాంబార్, జింక, దుప్పి, కొండ గొర్రె, బ్లాక్ బక్ తదితర శాకాహార జంతువుల వివరాలను ఎంస్ట్రిప్స్ యాప్‌లో నమోదు చేస్తారు. ఉదయం పూట అటవీ ప్రాంతంలో కాలి నడకన నిశబ్ధంగా వెళ్తూ రెండు కిలోమీటర్ల పరిధిలో సర్వే చేపడతారు. జంతువుల పాద ముద్రలు, మల విసర్జనలు సేకరించి జిప్‌లాక్ కవర్‌లో భద్రపరుస్తున్నారు. సేకరించిన తర్వాత వాటిని ఆలిండియా టైగర్ కన్జర్వేషన్‌కు పంపనున్నారు. సర్వే చేపట్టే అధికారులకు ప్రత్యేక కిట్లు సైతం అందజేశారు. ప్రత్యక్ష, పరోక్ష గణన విధానాలను అనుసరిస్తూ జంతువులను లెక్కించనున్నారు.
జంతుగణన సర్వేతో అటవీ ప్రాంతాల్లో ఎన్ని జంతువులు ఉన్నాయనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటు పులులు నివసించడానికి అనువైన స్థలమా.. కాదా అనే విషయం కూడా తెలియనుంది. ఆరు రోజుల పాటు కొనసాగే ఈ సర్వేలో మూడు రోజులు పూర్తయింది. సర్వే అధికారులకు ప్రత్యేక కిట్లు అందించాం. గణనలో భాగంగా జంతువుల మల విసర్జన, పాదముద్రలు జిప్‌లాక్ కవర్లో సేకరిస్తున్నాం.
– రవీందర్, ఎఫ్‌ఆర్‌వో, కమ్మర్‌పల్లి
అడవిలో జంతు గణన
అడవిలో జంతు గణన


