బెటాలియన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
● డీజీపీకి విన్నవించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
డిచ్‌పల్లి: డిచ్‌పల్లిలో ఉన్న రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని డీజీపీ శివధర్‌రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన డీజీపీని కలిసిన ఎమ్మెల్యే ఈమేరకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డిచ్‌పల్లిలో 1975వ సంవత్సరంలో ఏడో బెటాలియన్ ఏర్పడిందన్నారు. నాడు నిర్మించిన పరిపాలన భవనం, అధికారులు, సిబ్బంది నివాస గృహాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయని డీజీపీకి వివరించారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే రూరల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల పోలీస్‌స్టేషన్ల పరిధిని మార్పు చేయాలని కోరారు. ఎమ్మెల్యే వినతులపై డీజీపీ సానుకూలంగా స్పందించారు. అనంతరం డీజీపీని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.


