మానవత్వం చాటిన టీచర్లు
ఖలీల్‌వాడి: ఆపదలో ఉన్న ఓ విద్యార్థి కుటుంబానికి జిల్లా ఉపాధ్యాయులు ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. ఇందల్వాయి మండలం లోలం ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న హేమంత్ అనే విద్యార్థికి ఇటీవల కరెంటు షాక్ తగిలి కుడి చేయిని తొలగించారు. ఆస్పత్రి ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్న హేమంత్ కుటుంబానికి జిల్లాలోని ఉపాధ్యాయులు విరాళాల రూపంలో రూ. 1.47 లక్షలు సేకరించారు. శుక్రవారం డీఈవో అశోక్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి చెక్కును అందించారు. సుమారు 200 మంది ఉపాధ్యాయులు తమకు తోచిన సహాయం అందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. విరాళాల సేకరణలో బాధ్యతను తీసుకొని ముందుకు నడిచిన ఎస్జీటీయూ అధ్యక్షుడు వెంకటరమణ, న్యావానంద్ గంగాధర్, నాయక శ్రీధర్, ఇంద్రకరణ్‌ను డీఈవో ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎస్జీటీయూ ప్రధాన కార్యదర్శి గంగప్రసాద్, దాసరి గంగాధర్, సురేశ్, శ్రీధర్, శ్రీనివాస్, భోజన్న, వెంకట్రాం యాదవ్ ఉన్నారు.


