ఆర్మూర్‌ కాంగ్రెస్‌లో ‘చిన్న’ కుదుపు! | - | Sakshi
Sakshi News home page

ఆర్మూర్‌ కాంగ్రెస్‌లో ‘చిన్న’ కుదుపు!

Jan 23 2026 9:03 AM | Updated on Jan 23 2026 9:03 AM

ఆర్మూర్‌ కాంగ్రెస్‌లో ‘చిన్న’ కుదుపు!

ఆర్మూర్‌ కాంగ్రెస్‌లో ‘చిన్న’ కుదుపు!

ఆర్మూర్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్‌ పట్టణ కాంగ్రెస్‌లో ‘చిన్న’ కుదుపు మొదలైంది. అందుకు టీపీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఏబీ శ్రీనివాస్‌(చిన్న) సతీమణి మాజీ కౌన్సిలర్‌ శ్రీదేవికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రిజర్వేషన్‌ కలిసి రావడమే కారణంగా చెప్పవచ్చు. మాజీ చైర్‌పర్సన్‌లు కశ్వప్‌ స్వాతిసింగ్‌ బబ్లూ, పండిత్‌ వినీత పవన్‌తోపాటు మాజీ కౌన్సిలర్లు ఖాందేశ్‌ సంగీత శ్రీనివాస్‌, మెడిదల సంగీత రవిగౌడ్‌లు ప్రస్తుతం చైర్‌పర్సన్‌ పీఠం రేసులో ఉన్నారు. అయితే ఈ నలుగురు బీఆర్‌ఎస్‌ పార్టీలో పదవులు అనుభవించి గతేడాది కాంగ్రెస్‌లో చేరిన వారు కావడంతో అధికారంలో లేని సమయంలో సైతం కాంగ్రెస్‌ పార్టీనే పట్టుకొని ఉన్న ఏబీ శ్రీదేవి శ్రీనివాస్‌(చిన్న)పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంతోపాటు ప్రస్తుత రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో ఏబీ శ్రీనివాస్‌కు సత్సంబంధాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బరిలో దిగితే తమకు పీఠం దక్కదని భావించిన ఆశావహుల భర్తలు ఇటీవల ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను కలిసినట్లు సమాచారం. చైర్‌పర్సన్‌ అభ్యర్థి, కౌన్సిలర్ల టికెట్లపై చర్చించగా చైర్‌పర్సన్‌ అభ్యర్థిని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, కౌన్సిలర్ల టికెట్లు మాత్రం పార్టీకి, ప్రజలకు సేవ చేసిన వారిపై సర్వే నిర్వహించి గెలిచే అవకాశాలు ఉన్న వారికే కేటాయిస్తామని మహేశ్‌ కుమార్‌గౌడ్‌ స్పష్టతనిచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఏబీ శ్రీనివాస్‌(చిన్న) రాష్ట్రస్థాయి నేత కావడంతో ఆయనకు కార్పొరేషన్‌ స్థాయిలో పదవి ఇచ్చే అవకాశం ఉందని, దీంతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రేసులో ఉండబోరని ఓ వర్గానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయమై చిన్నను సంప్రదించగా పార్టీ అధిష్టానం సూచించినట్లు తాను నడుచుకుంటానని స్పష్టం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో చిన్న నామినేషన్‌ వేస్తేగానీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిపై స్పష్టత రాదని భావించిన మరికొందరు నాయకులు ఆయన సతీమణి శ్రీదేవిని కౌన్సిలర్‌గా ఓడించగలిగితే చాలంటూ చర్చించుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరికొందరు కాంగ్రెస్‌ నాయకులు ఇంకో అడుగు ముందుకు వేసి బీజేపీ ముఖ్య నాయకులతో రహస్యంగా మాట్లాడి తమకు బీజేపీ కౌన్సిలర్‌ టికెట్‌ కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. బీజేపీలో తమవర్గం మెజారిటీ కౌన్సిలర్లు విజయం సాధిస్తే శ్రీదేవి(చిన్న)కి చైర్‌పర్సన్‌ పీఠం దక్కకుండా అడ్డుకోవచ్చని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఆర్మూర్‌ పట్టణ కాంగ్రెస్‌కు చిన్న ఫీవర్‌ పట్టుకుందని చర్చ జరుగుతోంది.

టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన

పీవీఆర్‌ వర్గం నాయకులు

చైర్‌పర్సన్‌ను నిర్ణయించేది అధిష్టానమే..

సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పిన మహేశ్‌ కుమార్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement