వలస కార్మికులపై నకిలీల వల
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్‌కు చెందిన రమేశ్ అర్మేనియా దేశం వెళ్లేందుకు జగిత్యాల్‌కు చెందిన ఓ ఏజెంట్‌కు రూ.3.50 లక్షలు చెల్లించి ఒరిజినల్ పాస్‌పోర్టును అందజేశాడు. వీసా కోసం మెడికల్ టెస్టులు, రెస్యూమ్ తయారీ, ఆన్‌లైన్‌లో వివరాల నమోదు పేరిట సదరు ఏజెంట్ మరో రూ.25 వేలు అదనంగా ఖర్చు చేయించాడు. ఏడాది గడచినా వీ సా ఇవ్వకపోగా ఒరిజినల్ పాస్‌పోర్టు కావాలంటే మరో రూ.10 వేలు చెల్లించాల్సిందేనని ఏజెంట్ డి మాండ్ చేశాడు. ఎందుకు చెల్లించాలని బాధితుడు ప్రశ్నిస్తే ఏజెంట్ నుంచి ఎలాంటి సమాధానం లే దు. చివరకు అదే ఏజెంట్‌ను ఇటీవల జగిత్యాల పో లీసులు అరెస్టు చేసి 114 పాస్‌పోర్టులు, ల్యాప్‌ట్యా ప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఎంతో మంది రమేశ్‌లాంటి బాధితులు ఏజెంట్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. నకిలీ ఏజెంట్ల మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
150 ఏజెన్సీలకే అనుమతి..
విదేశాంగ శాఖ అనుమతి పొందిన మ్యాన్‌పవర్ రిక్రూటింగ్ ఏజెన్సీలు రాష్ట్రంలో 150 మాత్రమే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 3,324 లైసెన్స్ ఉన్న ఏజెన్సీలు ఉండగా, మన రాష్ట్రంలో అనుమతి లేకుండా రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్న నకిలీ సంస్థల సంఖ్య 2 వేలకు మించి ఉంటుందని అంచనా. లైసెన్స్ పొందిన ఏజెన్సీలు విదేశాంగ శాఖ నిబంధనల ప్రకారం అక్కడి కంపెనీలతో సమన్వయం చేసుకొని వీసాలు జారీ చేస్తాయి. లైసెన్స్ లేని ఏజెన్సీల నిర్వాహకులు దళారులపై ఆధారపడి 10 మందికి వీసాలు ఇప్పిస్తే 90 మందికి టోపీ పెడుతున్నారనే ఆరోపణలున్నాయి.
గల్ఫ్‌యేతర దేశాలకే ప్రాధాన్యం...
నకిలీ ఏజెన్సీ సంస్థలు గల్ఫ్‌యేతర దేశాలకు వీ సాల పేరిట నిరుద్యోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్లా, కామారెడ్డి తదితర పట్టణాలలో వందలాది ఏజెన్సీలు వెలిసి కెనడా, అర్మేనియా, పోలాండ్, మాల్టా, అజర్‌బైజాన్, రష్యా దేశాలతోపాటు యూరప్ దేశాల పేర్లు చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండల కేంద్రానికి చెందిన ఓ ఏజెంటు కెనడా వీసాలు ఇప్పిస్తానని నమ్మించి దాదాపు రూ.3 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. దొన్కల్ గ్రామ పంచాయతీ పరిధిలోని సంతోష్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి మెట్‌పల్లిలో ట్రావెల్స్ నిర్వహించి దాదాపు రూ.కోటి వరకు వసూలు చేసి కనిపించకుండా పోయాడు. వందలాది మంది యువకులను దోచుకుంటున్న ఏజెన్సీ నిర్వాహకులపై పోలీసులు నామమాత్రంగా కేసులను నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగిత్యాలలో ఒక నకిలీ ఏజెంటుపై గతంలో పోలీసులు పీడీ యాక్టును అమలు చేశారు. నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటేనే మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విచ్చలవిడిగా వెలిసిన ట్రావెల్ ఏజెన్సీలు
వీసాల జారీకి అనుమతి లేకున్నా దర్జాగా నిర్వహణ
అడ్డుకట్ట వేయలేకపోతున్న
ప్రభుత్వ యంత్రాంగం


