క్రీడల నిర్వహణ ఎలా..?
● అధ్వానంగా క్రీడా ప్రాంగణాలు
● ప్రశ్నార్థకంగా సీఎం కప్
పోటీల నిర్వహణ
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల ని ర్వహణ అనేక గ్రామాల్లో ప్రశ్నార్థకంగా మారింది. క్రీడా ప్రాంగణాలు అస్తవ్యస్తంగా ఉండటం, వాటిని బాగు చేసే పరిస్థితి లేకపోవడంతో క్రీడా పోటీల నిర్వహణకు అనువైన స్థలాల కొరత తీవ్రమైంది. ఫలితంగా గ్రామాల్లో ఆరు రోజులపాటు సాగాల్సిన క్రీడా పోటీలను కేవలం క్రీడాకారుల ఎంపికతోనే సరిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం శనివారంతోనే గ్రామాల్లో క్రీడా పోటీలు ప్రారంభం కావాల్సి ఉంది. మండల కేంద్రాల్లో టార్చ్ ర్యాలీలను నిర్వహించి క్రీడా పోటీలను మొక్కుబడిగా ప్రారంభించారు. 545 గ్రామ పంచాయతీలు ఉండగా 530 గ్రామాల్లోనే 2022లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అనువైన స్థలాల ను గుర్తించి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు జరగలేదు. ఇది ఇలా ఉండగా గ్రామీణ స్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, యోగా పోటీలను నిర్వహించాల్సి ఉంది. యోగా పోటీలను వరండాల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఇతర పోటీలకు మాత్రం కచ్చితంగా క్రీడా ప్రాంగణాలు అవసరం కానున్నాయి. 2022లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల నిర్వహణ తూతూ మంత్రంగానే సాగుతోంది. కనీసం రెండున్నర ఎకరాల్లో క్రీడా ప్రాంగణాలు ఉండాలని అప్పట్లో ప్రభుత్వం నిర్దేశించింది. అనువైన స్థలాలు లేకపోవడంతో కొద్ది స్థలంలోనే ప్రాంగణాలను ఏర్పాటు చేసినా నిర్వహణ లోపం వల్ల అనేక చోట్ల వినియోగంలోకి రాలేవు. కనీసం సీఎం కప్ పోటీలను దృష్టిలో ఉంచుకుని క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.
క్రీడల నిర్వహణ ఎలా..?


