ఆశావహుల పక్కచూపులు!
పన్నులు కట్టి.. పోటీకి సిద్ధం..
● మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవడమే
లక్ష్యంగా ఎత్తుగడలు
● ఒక పార్టీ టికెట్ ఇవ్వకపోతే
మరో పార్టీ నుంచి దక్కించుకునే యత్నం
ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో రాజకీయం రోజురోజుకు రంజుగా మారుతోంది. పార్టీ టికెట్ల కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో వార్డు స్థానం నుంచి సుమారు ఐదారుగురు ఆయా పార్టీలకు దరఖాస్తులు అందిస్తుండటంతో పోటీ అధికంగా మారింది. ఈక్రమంలో టికెట్ల కోసం కొందరు ఆశావహులు తటస్థంగా ఉంటూ ఏ పార్టీ టికెట్ ఇస్తే, ఆ పార్టీలోకి మారే ప్రయత్నాలు చేస్తున్నారు.
● నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించే వారి సంఖ్య అధికంగా ఉంది. ఒక్కో వార్డులో ముగ్గురు, నలుగురు కాంగ్రెస్ పార్టీ నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. ఎంతమంది దరఖాస్తు చేసినా పార్టీ మాత్రం ఒక్కరికే టికెట్ ఇస్తుంది. దీంతో పలువురు ఆశావహులు అధికార పార్టీ టికెట్ లభించని పక్షంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ అయినా సాధించి గెలవాలనే పట్టుదలతో ఆయా పార్టీల నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండాలనే పట్టుదలతో ఉన్నారని సమాచారం.
● ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ గంగామోహన్ చక్రు బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నాడు. కానీ చైర్‌పర్సన్ రిజర్వేషన్ కలిసి రావడంతో తన సతీమణి సవిత చక్రును బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించడానికి మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. 24వ వార్డుకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఆకుల రాము తరువాతి కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి పోటీ ఉండటంతో 9వ వార్డు నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాడు. తనకు టికెట్ రాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలనే సంకల్పంతో ఉన్నాడు. 27వ వార్డుకు చెందిన బదాం రాజ్ కుమార్ సైతం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ పార్టీ ముఖ్య నాయకులు ఈ వార్డు నుంచి ఇతర ఆశావహులను ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో బీజేపీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడానికి సిద్దమవుతున్నాడు.
2వ వార్డు ఎస్టీ రిజర్వు కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్లు పూల నర్సయ్య, వనం శేఖర్‌లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఆర్మూర్ పట్టణంలోనే కాకుండా నిజామాబాద్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల్లో పార్టీ టికెట్ పొందే ఆశావహులు ఎవరో తెలియనుంది.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలటీల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న ఆశావహులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆదర్శప్రాయంగా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి సొంత ఇళ్లు ఉంటే ఇంటి పన్ను, నల్లా పన్ను లాంటివి బకాయి ఉంటే నామినేషన్ల స్క్రూటినీలో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. బకాయిదారుల నామినేషన్‌ను సైతం తిరస్కరించడానికి ఆవకాశం ఉంది. దీంతో తమపై బకాయి ఉన్న పన్నులను కట్టేయడమే కాకుండా అద్దె ఇంట్లో ఉండే ఆశావహులు ఆ ఇంటి యజమానులతో సైతం పన్నులను కట్టిస్తూ పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఈ వివరాలన్నీ తెలిసి సిద్ధంగా ఉన్నప్పటికీ కొత్తగా పోటీలోకి వస్తున్న అభ్యర్థులు మాత్రం ఒకటికి రెండు సార్లు ఎన్నికల నిబంధనలను తెలుసుకుంటూ రంగంలోకి దిగుతున్నారు. ఇక రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నాయకులు కాంట్రాక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇలాంటి వారు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న తరుణంలో కాంట్రాక్టర్ లైసెన్సును రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఈక్రమంలో వారి కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా పోటీ చేయించడమా లేదా లైసెన్సును రద్దు చేసుకొని పోటీలో నిలవడంపై సన్నిహితుల వద్ద అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కలిసి వచ్చిన రిజర్వేషన్‌తో కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న ఆశావహులు కుల ధ్రువీకరణ పత్రాలను పొందడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కలిసి రావడంతో ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఆశావహులు తమ భార్యను లేదా తల్లిని బరిలో దింపడానికి గాను వారి కుల ధ్రువీకరణ పత్రాలను పొందడానికి మీసేవా, తహసీల్దార్ కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు.


