పలువురికి జైలు
సమయపాలన పాటించని హోటల్ నిర్వాహకుడికి..
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో
కామారెడ్డి క్రైం: మద్యం తాగి వాహనాలు నడిపినందుకు గాను జిల్లా వ్యాప్తంగా ఆయా కోర్టులు ఒకే రోజు 27 మందికి శిక్షలు విధించాయి. ఇటీవల పోలీసులు జిల్లావ్యాప్తంగా డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని మంగళవారం స్థానిక కోర్టులలో హాజరుపర్చగా 14 మందికి ఒకరోజు జైలు శిక్ష, మరో 13 మందితోపాటు మొత్తం 27 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానాలు విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లాలోని అన్ని పీఎస్‌ల పరిధిలో క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 11 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని మంగళవారం పోలీసులు జిల్లాకేంద్రంలోని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. జడ్జి 11 మందికి ఒక్కొక్కరి రూ.10వేల చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్‌అలీ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఐదుగురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. అలాగే ఐదో టౌన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు ఇటీవల డ్రంకన్‌డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. వారిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఒకరికి ఏడురోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. మరో వ్యక్తికి రూ.పదివేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
ఇందల్వాయి: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పోలీసులు చేపట్టిన డ్రంకన్‌డ్రైవ్ తనిఖీల్లో ఇద్దరు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని మంగళవారం స్పెషల్ ఎకై ్సజ్ కోర్టులో మెజిస్ట్రేట్ అహమ్మద్ మెయినొద్దిన్ ఎదుట హాజరు పర్చినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. జడ్జి వారిలో ఒకరికి ఏడు రోజుల జైలు శిక్ష, మరొకరికి రూ. పదివేల జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని మాల పల్లిలో న్యూ సవేరా హోటల్‌ను నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడంతో హోటల్ యజమానిని ఇటీవల ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి అరెస్టు చేశారు. మంగళవారం హోటల్ నిర్వాహకుడిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి అతడికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.


