ఆభరణాల కోసం తల్లిపై కొడుకు దాడి
● హత్యాయత్నం కేసు నమోదు,
నిందితుడి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి
కామారెడ్డి క్రైం : మద్యానికి బానిసైన ఓ కొడుకు మెడలో ఉన్న ఆభరణాలు అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోవడంతో కన్న తల్లి అని కూడా చూడకుండా హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఆమైపె కర్కశంగా దాడి చేసి ఆభరణాలు లాక్కొని ఉడాయించాడు. దాడిలో తీవ్రగాయాలైన సదరు మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకోగా 24 గంటల్లోపే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి డివిజన్ పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. కంచర్ల శంకర్, అతని భార్య గౌరవ్వ, కుమారుడు రాజేశ్‌తో కలిసి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ జీవిస్తున్నారు. రాజేశ్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజేశ్ డబ్బులు కావాలని తల్లితో గొడవపడ్డాడు. లేవని చెప్పడంతో మెడలోని బంగారం గొలుసు ఇవ్వాలని గొడవకు దిగాడు. తల్లి నిరాకరించడంతో చేతికి ఉన్న ఇనుప కడియం, మరో ఇనుప రాడ్డుతో తల్లి తలపై బలంగా కొట్టి గొలుసు లాక్కొని పరారయ్యాడు. గౌరవ్వ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన భర్త శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గౌరవ్వను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని సోమవారం ఉదయం పట్టణంలోని జేపీఎన్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. బంగారం గొలుసు, దాడికి ఉపయోగించిన ఇనుప కడియంను స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
దోపిడీ కేసులో ఇద్దరు రిమాండ్
కామారెడ్డి క్రైం: మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి మాయమాటలు చెప్పి దోపిడీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అనే వ్యక్తి వారం రోజుల క్రితం రామారెడ్డి చౌరస్తాలో ఉన్న ఓ కల్లు దుకాణంలో కల్లు సేవించాడు. మత్తులో ఉన్న అతనితో ఇద్దరు వ్యక్తులు మాటలు కలిపారు. ఇంటి వద్ద దింపుతామని నమ్మించి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని సిరిసిల్లా రోడ్డు ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. రాడ్డుతో దాడి చేస్తామని బెదిరించి ఇర్ఫాన్ వద్దనున్న రూ.700 నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు విచారణ జరిపి నిందితులను ఇస్లాంపుర కాలనీకి చెందిన మహ్మద్ ఖుద్బుద్దీన్, మహ్మద్ సమీర్‌గా గుర్తించారు. సోమవారం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, సిబ్బందిని అభినందించారు.
ఆభరణాల కోసం తల్లిపై కొడుకు దాడి


