
పోరాటయోధుల చరిత్ర భావితరాలకు తెలపాలి
● అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
సుభాష్‌నగర్: నిజాం నవాబు నిరంకుశ పాలనకు ఎదురు తిరిగిన తెలంగాణ పోరాట యోధుల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారితో కలిసి ధన్‌పాల్ సూర్యనారాయణ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాంజీ గోండ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, దాశరథి కృష్ణమాచార్యులు, షోయబుల్లా ఖాన్ వంటి ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. తెలంగాణ బిడ్డల ఆత్మఘోషను గ్రహించిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 17న నిజాం మెడలు వంచి ఇక్కడి ప్రజలకు విముక్తి కల్పించారన్నారు. నిజాం ఆనవాళ్లను పూర్తిగా చెరిపేసి, నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ఉపాధ్యక్షులు పాలెపు రాజు, జిల్లా కార్యదర్శి జ్యోతి, మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.