
ఆరోగ్యకర ఆహారం కోసం..
జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05
అంగన్‌వాడీ సెంటర్లు 1501
బాలింతలు 61,200
గర్భిణులు 9,821
చిన్నారులు 81,262
నిజామాబాద్‌నాగారం : అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు తాజా, ఆరోగ్యకర పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో మొత్తం 1501 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 400 సెంటర్లకు సొంత భవనాలు ఉండగా.. కూరగాయల సాగు కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పోషణ్ వాటిక’ (న్యూట్రి గార్డెన్) కార్యక్రమానికి 300 సెంటర్లను ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో సెంటర్‌కు రూ.10 వేల చొప్పున నిర్వహణ నిధులు అందించనున్నారు.
జిల్లాకు చేరిన విత్తనాలు
పోషణ్ వాటికలో భాగంగా అంగన్‌వాడీ సెంటర్ల ఆవరణలో కూరగాయల సాగు కోసం ఇప్పటికే జిల్లాకు విత్తనాలు సరఫరా అయ్యాయి. రూ.500 ఖరీదు చేసే విత్తన ప్యాకెట్లు జిల్లా కార్యాలయానికి రాగా300 కేంద్రాలకు పంపిణీ చేశారు. ప్యాకెట్లలో పాలకూర, వంకాయ, తోట కూర, టమాట, చిక్కుడు విత్తనాలున్నాయి. సేంద్రియ పద్ధతిలో కూరగాయాలు సాగు చేయనున్నారు. ముందుగా ప్రతి సెంటర్‌కు రూ.2వేలు వెచ్చించి భూమి చదును చేయించనున్నారు. ఒక్కో సెంటర్‌కు మొత్తం రూ.10వేల వరకు ఖర్చు చేయనున్నారు.
గతంలో నెరవేరని లక్ష్యం
గతంలో అంగనవాడీ కేంద్రాలకు ఆకుకూరలు, కూరగాయలను కాంట్రాక్టర్లు సరఫరా చేసేవారు. సరఫరా బాధ్యతలు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యత లేని కూరగాయలు, ఆకుకూరలు అంటగట్టేవారు. దీంతో కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యం నెరవేరలేదు. అటు తర్వాతా అంగన్‌వాడీ టీచర్లే గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయలు కొంటూ వంట చేయిస్తున్నారు. బిల్లులు సక్రమంగా రాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు.
పోషణ్‌వాటిక పథకానికి జిల్లాలోని 300 కేంద్రాలను ఎంపిక చేశారు. ఐదు రకాల విత్తనాల ప్యాకెట్లను సరఫరా చేయడం జరిగింది. పథకం అమలు బాధ్యత అంగన్‌వాడీ టీచర్లే చూసుకోవాల్సి ఉంటుంది. స్థలాల కొరత కారణంగా కొన్ని కేంద్రాల్లో అమలు చేయడం లేదు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు బలవర్థక ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పథకాన్ని పక్కాగా అమలు చేస్తాం.
– రసూల్‌బీ, జిల్లా సంక్షేమాధికారిణి
నిరాసక్తత..!
పోషణ్‌వాటిక కింద కూరగాయలు సాగు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మంచిదే అయినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని కొందరు అంగన్‌వాడీ టీచర్లు అంటున్నారు. సెంటర్ల చుట్టూ ప్రహరీలు లేకపోవడం, పని భారం అడ్డంకిగా మారుతుందని అంటున్నారు. కూర గాయలు, ఆకుకూరల సాగుకు ఇబ్బందులు తలెత్తుతాయని, పశువులు, కోతుల బెడదతో సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదని నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.
అంగన్‌వాడీ సెంటర్లలో పోషణ్ వాటిక
చిన్నారులు, గర్భిణులకు తాజా, నాణ్యమైన
భోజనం అందించడమే లక్ష్యం
జిల్లాలోని 300 కేంద్రాల్లో అమలు
కేంద్రాలకు విత్తనాల పంపిణీ
ఒక్కో సెంటర్‌కు రూ.10వేల వరకు ఖర్చు
వెయ్యికిపైగా కేంద్రాల్లో స్థలాల కొరత