
కిటికీ చువ్వలు తొలగించి దొంగతనం
● 19 తులాల బంగారం..
● రూ.10 లక్షల విలువ చేసే
విదేశీ కరెన్సీ ఎత్తుకెళ్లిన దుండగులు
● నిజామాబాద్ నగరంలో ఘటన
ఖలీల్‌వాడి: ఇంటి కిటికీ చువ్వ(గ్రిల్స్)లను స్క్రూడ్రైవర్‌తో తొలిగించిన దుండగులు 19 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.10 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్‌పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బాబన్‌సాహెబ్ పహాడ్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బాబన్ సాహెబ్ పహాడ్‌కు చెందిన నిషాత్ ఆఫ్రిన్ భర్త సౌదీలో ఉంటున్నాడు. తన ఇద్దరు కుమారులతో కలిసి బుధవారం రాత్రి ఇంటికి తాళం వేసి ఆఫ్రిన్ అహ్మదీబజార్‌లో బంధువుల ఫంక్షన్‌కు వెళ్లింది. రాత్రి వేళ ఇంటి కిటికీ చువ్వలను స్క్రూడ్రైవర్‌తో తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాను ధ్వంసం చేసి అందులోని బంగారం, విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన ఆఫ్రిన్.. కిటికీ చువ్వలు తొలగించి ఉండడంతోపాటు బీరువాను గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి చోరీ జరిగిన ఇంటికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలను సేకరించారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సీసీఎస్, ఐదో టౌన్ పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే స్థానికులే చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.