
ఆశలు పదిలం..
● 39 టీఎంసీలకు చేరిన
ఎస్సారెస్పీ నీటి నిల్వ
● కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతుండడంతో ఆయకట్టు రైతుల ఆశలు పదిలమయ్యాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ సరైన వర్షాలు కురవకపోవడం, ఎగువ నుంచి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేకపోవడంతో రైతులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. స్థానికంగా కురిసిన వర్షాలతోపాటు మహారాష్ట్ర నుంచి వరద రావడంతో ఎస్సారెస్పీ నీటిమట్టం క్రమంగా పెరిగింది. ఎగువ నుంచి భారీ వరదలు రావడంతో నీటి నిల్వ 39 టీఎంసీలకు చేరింది. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో గరిష్టంగా లక్షా 5 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, నాలుగు రోజుల వ్యవధిలో 15 టీఎంసీల నీరు వచ్చింది.
ఊరించిన వరద..
వారం రోజులుగా కురిసిన వర్షాలతో ప్రాజెక్ట్‌లోకి గరిష్టంగా లక్షా 5 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. కానీ రెండ్రోజుల్లోనే వరద నీరు తగ్గుముఖం పట్టింది. 4,352 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ఆవిరి రూపంలో 443 క్యూసెక్కులు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1077.80 (39.18 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.
50 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే..
ఆయకట్టు పరిధిలో ఒక్క పంటకు నీరందించాలంటే ప్రాజెక్టులో కనీసం 50 టీఎంసీల నీటి నిల్వ ఉండాలి. ప్రస్తుతం 39.18 టీఎంసీల నీరుండగా, మరో 11 టీఎంసీలు అవసరం ఉంది. అక్టోబర్ 28వ తేదీ వరకు ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు మూసే అవకాశం లేదు. సుమారు మూడు నెలల కాలంలో ఎ గువ నుంచి ఇన్‌ఫ్లో కచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టులో 50 టీఎంసీల నీరు నిల్వ ఉంటే.. 5 టీఎంసీలు డెడ్‌స్టోరేజీ, 5 టీఎంసీలు తాగు నీటి అవసరాలకు, 5 టీఎంసీలు ఆవిరి రూపంలో పోగా, మిగతా 35 టీఎంసీల నీటిని ఖరీఫ్ పంటకు అందించొచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆయకట్టుకు కాలువల ద్వారా నీటి వి డుదల ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
ఎలాంటి ఆదేశాలు రాలేవు
ఎస్సారెస్పీ నుంచి కాలువల ద్వారా నీటి విడుదల చేపట్టేందుకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. మరింత వరద వచ్చి చేరితే నీటి విడుదల చేపట్టే అవకాశం ఉంది. ప్రాజెక్ట్‌లో నీటి వివరాల లెక్కలను ఉన్నతాధికారులకు పంపించాం.
– చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ