
మూడు దశాబ్దాల స్నేహం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వయస్సులో ఇద్దరి మధ్య 21 ఏళ్ల తేడా ఉన్నా వారి అభిప్రాయాలు మాత్రం ఒకటే. 34 ఏళ్ల వారి స్నేహ బంధానికి చూసిన వారు ఎవరైనా ముగ్ధులుకావాల్సిందే.. అభినందించి తీరాల్సిందే. వారే తాహెర్‌బిన్ హందాన్, పారుపల్లి గంగారెడ్డి. సిరికొండ గ్రామానికి చెందిన వీరు ఇద్దరు కాదు.. ఒక్కరే అని అంటారు. తాహెర్‌బిన్ వయస్సు 72 సంవత్సరాలు కాగా పారుపల్లి గంగారెడ్డి వయస్సు 51 సంవత్సరాలు. పారుపల్లి గంగారెడ్డి తండ్రి పారుపల్లి నారాయణ, తాహెర్‌బిన్ ఇద్దరూ కలిసి ప్రాథమిక స్థాయిలో విద్యనభ్యసించారు. సిరికొండలో ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. కాలక్రమంలో 1991 జనవరిలో తాహెర్‌బిన్, గంగారెడ్డి మధ్య నిజామాబాద్‌లో అనుకోకుండా స్నేహం కుదిరింది. అప్పటినుంచి ప్రతి అడుగులో, ప్రతి కదలికలో ఇద్దరూ కలిసే ఉంటూ వస్తున్నారు. ఈ 34 ఏళ్ల కాలంలో వీరిద్దరూ కలిసి వాహనాల్లో 18 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. ఢిల్లీ మొదలు దేశంలోని అనేక ప్రాంతాలకు వీళ్లిదరూ కలిసే వెళ్తారు. నిజామాబాద్‌లో ఉన్నప్పుడు పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రించే సమయం వరకు వారు కలిసే ఉంటారు. వారి గురించి తెలిసిన వారంతా తాహెర్ శరీరమైతే గంగారెడ్డి ఆత్మ అని అంటారు.
తాహెర్ ప్రస్తుతం ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా, గంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తాహెర్ 1994లో బోధన్ నుంచి, 2018లో నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు గంగారెడ్డి అన్నీ తానై వ్యవహరించాడు. 2018లో తాహెర్‌కు టిక్కెట్టు సాధించేందుకు గంగారెడ్డే పెద్ద స్థాయిలో ఢిల్లీ వరకు లాబీయింగ్ చేయడం విశేషం. ధర్మపురి శ్రీనివాస్ నుంచి పొద్దూటూరి సుదర్శన్‌రెడ్డి వరకు ప్రతిఒక్కరూ వీరిద్దరి స్నేహాన్ని చూసి ముచ్చటపడిన సందర్భాలు అనేకం.
21 ఏళ్ల వయస్సు తేడా ఉన్నా
అభిప్రాయాలు ఒకటే..
ఒకరు శరీరమైతే.. మరొకరు ఆత్మ!
ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే..
ఆదర్శంగా నిలుస్తున్న తాహెర్, పారుపల్లి