
చికిత్స పొందుతూ ఒకరి మృతి
పెద్దకొడప్‌గల్(జుక్కల్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మండల కేంద్రంలోని జాతీయ రహదారి 161పై గల బ్రిడ్జి సైడ్‌వాల్‌ను ఇటుక లారీ గురువారం ఢీకొట్టడంతో ఘటన స్థలంలోనే ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన నాందేడ్‌కు చెందిన గణేష్ (20) నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి మృతిచెందినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. ఘటన స్థలంలో పిట్లం మండలంలోని రూమ్‌తండాకు చెందిన నర్సింగ్ మృతి చెందగా, అతడి భార్య హలవత్ సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. జక్రాన్‌పల్లి మండలంలో..
జక్రాన్‌పల్లి: పురుగుల మందు తాగిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన ద్యాగ రవి అనే రైతుకు ఇటీవల అదే గ్రామానికి చెందిన పొట్టి గంగారెడ్డి, తుమ్మల గంగారెడ్డి, సయ్యద్ ముహమ్మద్, శ్రీకాంత్ కలిసి మద్యం తాగించి, అతడి భూమిని వేరేవారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. కొన్నిరోజుల తర్వాత విషయం తెలుసుకొని అతడు పంచాయితీ పెట్టించగా, వారు మరో భూమిని అతడికి రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ మృతుడు తాను చేసిన తప్పును తలుచుకుంటూ మానసికంగా కృంగిపోయాడు. ఈక్రమంలో గత నెల 16న అతడు పురుగుల మందు తాగడంతో అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా శుక్రవారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాలిక్ రెహ్మాన్ తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరి మృతి