
కొందరికే పీఎం కిసాన్
ఇందల్వాయి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం జిల్లాలో కొందరు రైతులకే ప్రయోజనం కలుగుతోంది. 2019 జనవరి 31వ తేదీ వరకు పట్టాపాస్ పుస్తకాలు కలిగిన సన్న, చిన్నకారు రైతులనే ఈ పథకానికి అర్హులుగా గుర్తించి సాగుకు పెట్టుబడిగా ఏడాదికి మూడు విడతల్లో కలిపి రూ.6వేలు రైతుల ఖాతాల్లో వేస్తోంది. ఆ తర్వాత పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారు ఈ పథకంలో నమోదుకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది రైతులు పీఎం కిసాన్ పథకానికి దూరమవుతున్నారు. తహసీల్ కార్యాలయాల్లో సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, సక్సెషన్, వారసత్వపు బదిలీల రూపంలో నిత్యం పదుల సంఖ్యలో భూ లావాదేవీలు జరుగుతుంటాయి. ఇలా నూతన పట్టాలు పొందిన రైతులు పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో చేరేందుకు నిబంధనలు అడ్డుపడుతున్నాయి. పీఎం కిసాన్ డబ్బులు వచ్చిన రైతు ఎవరైనా చనిపోతే వారి ద్వారా వారసత్వపు పాసు పుస్తకాలు పొందిన రైతులను మాత్రమే నూతనంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో చేర్చే అవకాశం ఉంది.
35 శాతం మందికే..
జిల్లాలో 2,65,000 మంది రైతులు ఉండగా అందులో కేవలం 88,000 మంది రైతులకు(35 శాతం) పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అందుతున్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పట్టాలు పొందిన రైతులెవ్వరికీ ఈ పథకం వర్తించడం లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పథకాల అమలులో సౌలభ్యం కోసం అర్హులైన రైతులందరికీ విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అందుకోసం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాంకేతిక సమస్యలు, రైతుల్లో అవగాహన లేమితో నత్తనడకన సాగుతోంది. జిల్లాలో మొత్తం 2,91,749 పట్టా పాస్‌బుక్‌లు ఉంటే ఇప్పటి వరకు 1,40,285 మందే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం(48.08 శాతం) అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
ఐదేళ్లుగా నమోదుకు అవకాశం కరువు
లక్ష్యం చేరని ఫార్మర్
ఐడీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ