నిర్మల్‌టౌన్: గణేశ్ నిమజ్జన ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి తెలిపారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏటా మాదిరిగా ఈసారి శోభాయాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు మున్సిపల్ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జన మార్గాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు, డీఈ హరిభూవన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


