ఉత్తర కార్తె.. పత్తికి సెగ | - | Sakshi
Sakshi News home page

ఉత్తర కార్తె.. పత్తికి సెగ

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

భైంసా: ఉత్తర ఫల్గుణి కార్తెలో భానుడి ప్రతాపంతో పత్తి రైతుల్లో ఆందోళన మొదలైంది. జిల్లావ్యాప్తంగా నాలుగు రోజులుగా ఎండలు తీవ్రంగా ఉండటంతో పత్తిపై ప్రభావం పడుతోంది. పూత, కాత దశలో పిందెలు, చిన్న కాయలు నేలరాలుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు నీటి తడులు, ఇతర యాజమాన్య చర్యలు చేపడుతూ అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. మధ్యాహ్నం 12 దాటితే పంట పొలాల్లో పనిచేయలేని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ కూలీలు ఎండవేడిమికి అల్లాడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల్లో పత్తి సాగైంది. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు కొంత పుంజుకున్నాయి. అయితే, రెండురోజులుగా ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో పొలాల్లో తేమ తగ్గడంతో దిగుబడిపై ప్రభావం పడనుంది. ఇటీవల కురిసిన వర్షాలతో కొంత ఊరట పొందిన పంటకు మళ్లీ ఎండ సెగ తగలడంతో పరిస్థితి మారింది. మరోసారి వానలు కురిస్తే పంటకు ప్రాణం పోసినట్టవుతుందని రైతులు ఆశిస్తున్నారు.

పిందెలు.. కాయలు రాలుతున్నాయి

పత్తి మొక్కలు పూత, కాత దశలో ఉన్న సమయంలో ఎండలు ముదరడంతో పిందెలు నిలవడం లేదని రైతులు చెబుతున్నారు. చిన్న కాయలు సైతం నేలరాలుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ దశలో పంటను కాపాడుకుంటేనే దిగుబడి చేతికందుతుందని, నీటి తడులు పెట్టడంతోపాటు యాజమాన్య చర్యలపై దృష్టిసారిస్తున్నారు.

ఎండలు పెరిగాయి

ఈసారి పత్తి బాగానే పెరిగింది. ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. ఎండతీవ్రతతో పిందెలు, చిన్న కాయలు రాలుతున్నాయి. పొలంలో తేమ తగ్గిపోతోంది. కూలీలతో పనులు చేయించాలన్నా మధ్యాహ్నం ఎండకు రావడం లేదు. వర్షం కురిస్తే పంట నిలబడుతుంది. లేకపోతే పెట్టుబడి కూడా తిరిగివస్తుందో లేదోనన్న భయం

ఉంది. – కదం మారుతి పటేల్‌, మాలేగాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement