పరాజయమే గురువు
ఓటమిని విజయంగా మలుచుకుని.. మూడో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించిన సాయికిరణ్ నిర్మల్ ఏఎస్పీగా బాధ్యతలు.. విజయ ప్రస్థానంపై ప్రత్యేక ఇంటర్వ్యూ..
నిర్మల్‌టౌన్: ఏటా సివిల్స్ కోసం లక్షల
మంది ప్రిపేర్ అవుతారు. పరీక్షలకు హాజరవుతారు. కానీ, వందల మందికి మాత్రమే అవకాశం దక్కుతుంది. కొందరికి మొదటి ప్రయత్నంలోనే అవకాశం దక్కగా కొందరు మూడునాలుగుసార్లు ప్రయత్నిస్తారు. నిర్మల్ ఎస్డీపీవోగా నియమితులైన పత్తిపాక సాయికిరణ్ కూడా మూడో ప్రయత్నంలో ఐపీ ఎస్ సాధించారు. రెండుసార్లు ఓడినా కుంగిపోలేదు. ఓటమిని విజయానికి సోపానంగా మలు చుకుని విజయానికి బాటలు వేసుకున్నారు. 2023లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. సాయికిరణ్ స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం. ఈ నెల 25న నిర్మల్‌లో ఏఎస్పీగా చేరారు. సబ్ డివిజనల్ కార్యాలయంలో శనివారం ’సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘పరాజయం గురువు‘ అనే సూత్రాన్ని అమలు చేసిన సాయికిరణ్, కష్టపడి ప్రయత్నించినవారిని ఉత్తేజపరుస్తున్నారు. సివిల్స్ విఫలమైనా, పోలీస్ సర్వీస్‌లో బాధ్యతలు చేపట్టి సేవ చేయడం ఆయన ధైర్యానికి చిహ్నం. ఇలాంటి కథలు యువతకు కొత్త ఆశలు నింపుతాయి. సాయికిరణ్ ప్రస్థానం ఆయన మాటల్లో..
హైదరాబాద్‌లోని సీబీఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశా. తర్వాత కాలికట్ ఐఐఎంలో ఎంబీఏ చదివా.. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగా. ఈ మేరకు సమయంతో నిమిత్తం లేకుండా.. రోజుకు 8 గంటలు చదువుకే కేటాయించా. అవగాహన పెంచుకుంటూ.. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాను. అత్యవసరం అనుకున్న సందర్భాల్లో శిక్షణ కేంద్రాలకు వెళ్లాను. అంతేకాకుండా అప్పటికే సివిల్స్‌లో విజయం సాధించిన వారిని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకున్నాను. తొలిసారి సివిల్స్ రాసి ఫెయిల్ అయ్యాను. రెండో ప్రయత్నంలో 2 మార్కులతో తుది జాబితాలో చోటు కోల్పోయాను. అయినా నిరాశ చెందలేదు. ప్రయత్నాన్ని ఆపలేదు. మూడోసారి పట్టుదలతో ఇష్టంగా చదువుతూ.. ఎలాగైనా ర్యాంక్ సాధించాలనుకున్నా. ఈ ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్‌తోపాటు, ఇంటర్వ్యూలోనూ విజయం సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యాను.
యువతకు మీరు ఇచ్చే సందేశం
చదువుతున్నప్పుడు ప్రతీ విషయంపై ఒక ఒపీనియన్ ఏర్పర్చుకోవాలి. ఆలోచించి ప్రతీ విషయాన్ని చర్చించాలి. దానికి టైంలిమిట్ ఏం పెట్టుకోవద్దు. ఆన్‌లైన్ రిసోర్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి. సిలబస్‌ను డివైడ్ చేసుకొని, ప్రణాళికతో ప్రిపేర్ కావాలి. ప్రీవియస్ పేపర్స్‌ను సమగ్రంగా అర్థం చేసుకుని, ఎలా ఎంతవరకు చదవాలని ఐడియా తెచ్చుకుని చదవాలి. గతంలో సివిల్స్ రాసిన సీనియర్ల సలహాలు, సపోర్టుతో తప్పులు సరి చేసుకోవాలి. అలాగే మొదటి ప్రయత్నంలో రాకపోయినా నిరాశ పడకుండా.. ముందుకు వెళ్లాలి. ఇవన్నీ అంకితభావంతో చేస్తే విజయం వరిస్తుంది.
నిర్మల్ ప్రజలకు ఏం చెప్తారు?
నిర్మల్‌లో ముఖ్యంగా యువత గంజాయి, సైబర్ క్రైమ్‌పై అవగాహన పెంచుకోవాలి. కుల మత భేదం లేకుండా అందరూ కలిసి ఒకటిగా ఉండాలి. చదువుకునే వయసులో తప్పటడుగులు వేసి వారి జీవితాలను పాడు చేసుకోవద్దు. నిర్మల్‌లో ప్రశాంత వాతావరణంలో ఉంచేందుకు ప్రయత్నిస్తాను. ఎవరికై నా ఏదైనా సమస్య వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలి.
పరాజయమే గురువు


