సత్వర న్యాయం అందాలి
నిర్మల్/సారంగపూర్: కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉండకుండా బాధితులకు సత్వర న్యాయం అందించేలా చూడాలని కోర్టుల బిల్డింగ్ కమిటీ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.సుజన, బిల్డింగ్ కమిటీ మెంబర్ జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండలతో కలిసి, సారంగపూర్ మండలం మహిళాప్రాంగణం పక్కన నూతన కోర్టుల భవన సముదాయానికి ఆదివారం భూమి పూజ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ లక్ష్మ ణ్ మాట్లాడుతూ చాలావిషయాలను న్యాయవ్యవస్థనే చూడాల్సి వస్తోందన్నారు. కోతులు, కుక్క ల వంటి సమస్యలనూ పట్టించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. కొత్త కోర్టులు కావాలని కోరుకోవద్దని, కేసులు తగ్గుతూ చివరకు కోర్టులు మూసివేసే రోజులు రావాలని ఆకాంక్షించారు. జిల్లాలో మూడు ప్రధాన వ్యవస్థల్లో మహిళలు ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. కలెక్టర్‌గా అభిలాషఅభినవ్, జడ్జిగా శ్రీవాణి, ఎస్పీగా జానకీషర్మిల, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జీగానూ జస్టిస్ సుజన ఉండటం మహిళ ప్రగతి నిదర్శనమని వివరించారు.
సంతోషకరమైన విషయం..
నిర్మల్‌లో నూతన కోర్టు భవనాల సముదాయ నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం హర్షనీయమని జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజన అన్నారు. ముందుగా కోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించిన భూమిపూజలో పాల్గొన్నారు. సహ న్యాయమూర్తులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
హైకోర్టు న్యాయమూర్తుల సహకారంతో..
జిల్లాలో ఇప్పటివరకు అరకొర వసతుల మధ్య కోర్టులు కొనసాగుతున్నాయని, నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ చేసుకోవడం సంతోషకరమైన విషయమని జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల సహకారంతోనే జిల్లాలో కోర్టు కాంప్లెక్స్ పూర్తవుతోందన్నారు.
న్యాయవాదులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలి..
కోర్టు సముదాయ భవనం జిల్లాకేంద్రానికి కాస్త దూరంగా ఉన్నందున నూతన కోర్టు సముదాయానికి సమీపంలోనే న్యాయవాదులకూ ఇళ్లస్థలాలు కేటాయించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి మల్లారెడ్డి కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. న్యాయమూర్తులు ప్రశంసాపత్రాలను అందించారు. డీఎల్‌ఎస్‌ఏ జడ్జి రాధిక అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాల్లో కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల, అడిషనల్ ఎస్పీలు సాయికిరణ్, రాజేశ్‌మీనా, ఉపేంద్రరెడ్డి, హైకోర్టు బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు అన్ముల జగన్, నిర్మల్ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.
సత్వర న్యాయం అందాలి


