
స్పీకర్ల సదస్సులో అమిత్ షా
సభాపతి స్థానం ఔన్నత్యం పెంచాలని పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. ‘‘సభల్లో అలజడి సృష్టించడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారింది. ఇది మంచి పరిణామం కాదు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటు, అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదు’’ అన్నారు. సభాపతులు తమ పనితీరుతో ఆ పదవి ఔన్నత్యం పెంచాలని పిలుపునిచ్చారు.
‘‘ప్రజా సమస్యలపై చర్చకు నిష్పాక్షిక వేదికగా సభలను తీర్చిదిద్దాల్సిన, వాటిలో పక్షపాతానికి తావులేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. లేదంటే సభలు జీవచ్ఛవాలతో సమానమే’’ అన్నారు.
అఖిల భారత స్పీకర్ల సదస్సును ఆదివారం ఢిల్లీ అసెంబ్లీలో ఆయన ప్రారంభించారు. స్పీకర్లు, శాసన మండళ్ల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లను ఉద్దేశించి ప్రసంగించారు. సభల్లో అర్థవంతమైన సంవాదాలు జరగకపోతే దేశానికి తీరని నష్టమన్నారు. ‘‘చర్చలకు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించడం సహించరానిది. విపక్షాలు సంయమనం పా టించాలి. కార్యకలాపా లు సజావుగా సాగేలా సహకరించాలి’’ అని సూచించారు.
ద్రౌపదికి జరిగిన అవమానం
నిండుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం ఎన్నో విపరిణామాలకు దారితీసిందని అమిత్ షా గుర్తుచేశారు. ‘‘సభా గౌరవం దిగజారితే దేశంలో కూడా అలాంటి దుష్పరిణామాలు తప్పవు. స్పీకర్ సారథ్యంలో జరిగే చర్చలతో దేశానికి ఎనలేని మేలు జరుగుతుంది. చట్టసభల భవనాలు జీవం పోసుకుంటాయి. స్పీకర్ అంటే సంరక్షకుడు, సేవకుడు.
సమస్యల పరిష్కారానికి మేధోమథనమే ఉత్తమ మార్గం. ‘‘ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయి సోదరుడు, స్వాతంత్య్ర యోధుడు విఠల్‌భాయి పటేల్ వందేళ్ల క్రితం సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. మన దేశంలో శాసనసభ చరిత్ర అప్పుడే మొదలైంది. అలాంటి విఠల్‌భాయి చరిత్ర ఇన్నాళ్లూ మరుగున పడింది’’ అని ఆవేదన వెలిబు చ్చారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తదితరులు సదస్సులో మాట్లాడారు.