దొంగ తెలివి మామూలుగా లేదు!. ఆయిల్‌ చోరీకి ఏకంగా సొరంగమే తవ్వేశాడు | Sakshi
Sakshi News home page

దొంగ తెలివి మామూలుగా లేదు!. ఆయిల్‌ చోరీకి ఏకంగా సొరంగమే తవ్వేశాడు

Published Sat, Oct 7 2023 5:07 PM

Video: Tunnels Plastic Pipes: How Indian Oil Was Being Robbed In Delhi - Sakshi

తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి, డబ్బులు, బంగారం, నగలు చోరీ చేసిన ఘటనలు చూసే ఉంటాం. చైన్‌ స్నాచింగ్‌లు సైతం పెరిగిపోయాయి. జేబులోని పర్సులు, మొబైల్‌ విషయాల్లోనూ కొందరు చేతివాటం ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ దొంగతనం గురించి తెలిస్తే షాక్‌ అవ్వకుండా అస్సలు ఉండలేదు. ఆయిల్‌ను దొంగతనం చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా సొరంగం తవ్వేశాడు.

పోచన్‌పూర్‌కు చెందిన రాకేష్‌ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) పైపుల నుంచి ఆయిల్‌ను అపహరించడానికి పెద్ద పథకమే వేశాడు. ఢిల్లీ - పానిపట్ ఇండియన్ ఆయిల్ పైప్‌లైన్‌ ప్రాంతానికి సొరంగం తవ్వాడు. ప్లాస్టిక్‌ పైపులు ఏర్పాటుచేసి పైపులైన్‌లోని ఆయిల్‌ను తోడేయడం ప్రారంభించాడు. ఆయిల్ సరఫరా తగ్గడంతో  అనుమానం వచ్చిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చదవండి: ఇదెక్కడి వింత.. దోమలను ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి, షాకైన వైద్యులు

సెప్టెంబర్‌ 29న పైప్‌లైన్‌ను తనిఖీ చేయగా.. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఆయిల్‌ దొంగిలిస్తున్నట్లు తెలిసిందని ఫిర్యాదులో తెలిపింది. కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడ తవ్వకాలు జరిపి ఆశ్చర్యపోయారు.

మెయిన్‌ ఆయిల్‌ లైన్‌కు డ్రీల్లింగ్‌ ద్వారా రంధ్రాలు చేసి ప్లాస్టిక్‌ పైపులు పెట్టి ఆయిల్‌ దొంగతనం చేసేందుకు ఓ మిషన్‌ను అమర్చినట్లు  గుర్తించారు. సొరంగం ద్వారా ఐఓసీఎల్‌ పైప్‌లైన్‌కు 40 మీటర్ల దూరం వరకు పైపులు వేసినట్లు తేలింది. ఈ పైపులు 52 ఏళ్ల రాకేష్ అలియాస్ గోలు అనే వ్యక్తికి చెందిన పొలంలోకి ఉండటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, మిగతా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement