
రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం: ధన్‌ఖడ్
భోపాల్: సీబీఐ డైరెక్టర్ వంటి ఉన్నతస్థాయి కార్యనిర్వాహక పదవుల నియామకాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భాగస్వామి కావడం ఏ మేరకు సబబని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నించారు. ‘‘చట్టప్రకారమే అయినా సరే, భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి ప్రక్రియలో సీజేఐ ఎలా పాల్గొంటారు? నాటి పాలకులు న్యాయతీర్పు తాలూకు ఒత్తిడికి లొంగడంతో ఈ నిబంధన పుట్టుకొచ్చింది. దీనికి చట్టపరంగా హేతుబద్ధత ఉందా?’’ అని ప్రశ్నించారు.
శుక్రవారం భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కార్యనిర్వాహక కార్యకలాపాలు న్యాయవ్యవస్థ నిర్ణయాలు, తీర్పుల ద్వారా జరగడం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి నిబంధనలను పునఃపరిశీలించాల్సిన సమయం వచ్చింది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. పాలనపరమైన వ్యవహారాల్లో శాసన, న్యాయవ్యవస్థల జోక్యం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్నారు.
కోర్టులకున్న న్యాయసమీక్ష అధికారం సముచితమే అయినా రాజ్యాంగాన్ని సవరించే అధికారం మాత్రం అంతిమంగా పార్లమెంటుదేనని ధన్‌ఖడ్ స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా పలు అంశాలపై న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను కూడా ఆయన పరోక్షంగా తప్పుబట్టారు. ‘‘న్యాయవ్యవస్థ తీర్పుల రూపంలో ప్రజల ముందుకు రావాలే తప్ప ఇతరేతర వ్యక్తీకరణలకు పూనుకోవడం ఆ వ్యవస్థ గౌరవాన్నే భంగపరుస్తుంది. సామాజికాంశాలపై న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడం ప్రపంచంలో మరెక్కడా జరగదు’’ అన్నారు. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే సాకుతో అధికారపు అతిశయం ప్రదర్శించరాదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.