మోదీ పాలన ప్రశంసనీయం | Union Cabinet honours PM Narendra Modi amid Longest PM | Sakshi
Sakshi News home page

మోదీ పాలన ప్రశంసనీయం

Jun 11 2026 4:20 AM | Updated on Jun 11 2026 4:20 AM

Union Cabinet honours PM Narendra Modi amid Longest PM

సుదీర్ఘకాలం పాలించారంటూ మోదీ సేవలను కొనియాడుతూ తీర్మానం ఆమోదించిన మంత్రివర్గం 

న్యూఢిల్లీ: స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల ద్వారా ఎన్నికై సుదీర్ఘకాలం నిరాటంకంగా ప్రధానమంత్రిగా పనిచేసిన నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అధిగమించారు. బుధవారం నాటికి ప్రధానిగా మోదీ 4,399 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. సరికొత్త మైలురాయికి చేరుకున్న మోదీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రపంచాధినేతలు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

 ప్రధాని మోదీ పాలన పుష్కరకాలాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. మోదీకి అభినందనలు తెలియజేస్తూ ఏకగీవ్రంగా తీర్మానాన్ని ఆమోదించారు. దేశ ప్రజలకు ప్రధానమంత్రి అందించిన సేవలను ప్రశంసిస్తూ మంత్రులందరూ కరతాళ ధ్వనులతో స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు. సమ్మిళిత వృద్ధి, సామాజిక న్యాయం దిశగా మోదీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. 

భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో దీనిని ఒక చరిత్రాత్మక మైలురాయిగా మంత్రివర్గం అభివర్ణించింది.  మోదీని కొనియాడుతూ రాష్ట్రపతి ముర్ము మోదీకి లేఖ రాశారు. ప్రధానిగా మోదీ సుదీర్ఘకాలం కొనసాగడం ప్రజల ఆదరాభిమానాలకు నిదర్శమని, దేశ చరిత్రలో ఇది కనీవినీ ఎరుగని ఘట్టమని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కొనియాడారు. 

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బిహార్‌ సీఎం సమ్రాట్‌ చౌదరీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్, ఒడిశా సీఎం మోహన్‌చరణ్‌ మాఝీ, హరియాణా సీఎం నాయబ్‌ సైనీ తదితరులు మోదీకి అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి కార్యాలయం సైతం మోదీకి శుభాకాంక్షలు తెలిపింది. ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోని, మాల్దీవుల అధ్యక్షుడు మోహమ్మద్‌ మెయిజ్జూ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్, మలేషియా ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీమ్, భూటాన్‌ ప్రధాని త్సారింగ్‌ టోబ్‌గే,  యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.  

మోదీ హయాంలో సర్వతోముఖాభివృద్ధి 
ఎన్‌డీఏ భేటీలో ప్రధానిని ప్రశంసించిన కూటమి పార్టీల అగ్రనేతలు  
బుధవారం ఢిల్లీలోని భారత్‌ మండపంలో ఎన్డీయే కూటమి సమావేశమైంది. 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సైతం ఈ కీలక ఎన్‌డీఏ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి పార్టీల అగ్రనేతలు మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని ఉద్ఘాటించారు. మోదీ సేవలను కొనియాడుతూ ఒక తీర్మానం ఆమోదించారు. ఎన్డీయే పక్షాల సదస్సులో బెంగాలీ ప్రముఖ అల్పాహారమైన ఝాల్‌మురీని ప్రధాని∙మోదీ రుచి చూశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement