ఐరాస సుస్థిరాభివృద్ధి యాక్షన్ అవార్డ్స్ ఫైనలిస్టుల జాబితా విడుదల
ఈ నెల 29న జెనీవాలో ‘హీరోస్ ఆఫ్ టుమారో’లకు సత్కారం
ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఎన్నో సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ఈ గ్లోబల్ చాంపియన్లను గౌరవించేందుకు ఉద్దేశించిన ‘యూఎన్ ఎస్‌డీజీ యాక్షన్ అవార్డ్స్’కు సంబంధించిన ఫైనలిస్టుల జాబితా విడుదలైంది. ‘హీరోస్ ఆఫ్ టుమారో’పేరిట ఐక్యరాజ్యసమితి ఈ జాబితాను తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంక్షోభాలను అధిగమిస్తూ, పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం, సుస్థిర జీవనోపాధి దిశగా పనిచేస్తున్న 9 అత్యుత్తమ కార్యక్రమాలు, వ్యక్తులు మూడు ప్రధాన విభాగాల్లో ఎంపికయ్యారు. – సాక్షి, స్పెషల్ డెస్క్
1. ప్రతికూలతలను అధిగమించటం
సోలార్ బ్రైట్ ఫ్యూచర్(కామెరూన్): సంక్షోభాలను అధిగమించి, ప్రజలకు ఈ సంస్థ సౌరశక్తి ద్వారా స్థిరమైన ఆర్థిక సాధికారత కల్పిస్తోంది.
ఉమెన్ జస్టిస్ ఇనీషియేటివ్ (గ్వాటెమల): స్థానిక గిరిజన/మూలవాసీ మహిళలు, బాలికలకు న్యాయం అందించటంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తోంది.
యంగ్ ఎమర్జింగ్ ఫార్మర్స్ ఇనీషియేటివ్(గ్వాటెమల): యువ త నేతృత్వంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతోంది.
2. సృజనాత్మకత
మదర్స్ ఆఫ్ కరేజ్(భారత్): సంప్రదాయ సంకెళ్లను తెంచుతూ ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వినూత్న పోరా టం చేస్తున్న బిహారీ తల్లుల సంస్థ.
రిటర్న్ వాటర్ హోమ్(ఇండోనేసియా): భవిష్యత్ తరాల కోసం సామూహిక భాగస్వామ్యంతో సహజ నీటి వనరులను పునరుద్ధరిస్తున్న ప్రాజెక్ట్ ఇది.
ఉమెన్ ఫర్ చేంజ్(దక్షిణాఫ్రికా): లింగ ఆధారిత హింస, వేధింపులపై గళమెత్తుతూ సామాజిక మార్పునకు బాటలు వేస్తున్న సంస్థ.
3. చేంజ్ మేకర్స్
ఓలా అలగ్‌బరీ (యెమన్): నీటి సంక్షోభాన్ని పరిష్కరిస్తూ దాని ద్వారా సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నారు.
రోకియాటూ ట్రోరే(మాలి): భూ పునరుద్ధరణను మహిళలు, చిన్నకారు రైతుల ఉపాధితో అనుసంధానిస్తున్నారు.
తాబన్ షోరేష్(ఇరాక్): యుద్ధ సంక్షోభాల నుంచి బయటపడి, బాధితుల పునరి్నర్మాణానికి, వారి వికాసానికి తోడ్పడుతున్నారు.
మహిళలు, బాలికలపై హింస నిర్మూలనకు స్థానిక పరిష్కారాల ద్వారా అంతర్జాతీయంగా కృషి చేస్తున్న ‘యూఎన్ ట్రస్ట్ ఫండ్ టు ఎండ్ వయొలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్’ ను విశిష్ట పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ అవార్డుల విజేతలను జెనీవాలో ఈ నెల 29న జరిగే అధికారిక వేడుకలో గౌరవించనున్నారు. స్థానిక సమస్యలకు స్థానిక నాయకత్వంతో పరిష్కారాలు కనుగొంటూ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ ఉద్యమకారుల కృషి సుస్థిర భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఐరాస ప్రశంసించింది.


