భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్ పలాసుని వంతెనపై జరిగిన ఓ భయంకర ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం అర్ధరాత్రి వేగంగా వచ్చిన ట్రక్కు.. తండ్రీకూతుళ్లు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి.. ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన నుంచి వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. తండ్రీ కుమార్తె కారులో ప్రయాణిస్తుండగా.. వంతెన దాటుతున్న సమయంలో వెనుక నుంచి ట్రక్కు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కును ఆపకుండా డ్రైవర్.. కారును రోడ్డుపై అలాగే నెట్టుకుంటూ.. ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఇది కారులో తండ్రీకుమార్తెలతో పాటు రోడ్డుపై ఇతర వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాద తీవ్రతకు కారు భారీగా దెబ్బతిన్నప్పటికీ.. తండ్రీకూతుళ్లు ఇద్దరూ స్వల్ప గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి వేళల్లో ట్రాఫిక్ నిబంధనల అమలు తీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి.
ట్రక్కు.. కారును నెట్టుకుంటూ వెళ్తున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నగర పరిధిలో తిరిగే భారీ వాహనాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని పలువురు నొక్కి చెప్పారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
సదరు ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన తీరును కచ్చితంగా తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను, అలాగే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నాడా? నిర్లక్ష్యంగా వ్యవహరించాడా? ఏదైనా మత్తులో ఉన్నాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
📍Bhubaneswar–Cuttack, Odisha: Chaos erupted on the highway after a dispute over giving side reportedly turned dangerous between a car and a Hyva truck. The truck allegedly dragged the car for nearly 200 meters while trying to flee the spot, creating panic on the road. Police… pic.twitter.com/eN5ubZJ3ps
— Deadly Kalesh (@Deadlykalesh) May 30, 2026


