పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్‌ | Trading within a limited range, Expert predictions on market movements | Sakshi
Sakshi News home page

పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్‌

Nov 21 2022 5:59 AM | Updated on Nov 21 2022 5:59 AM

Trading within a limited range, Expert predictions on market movements - Sakshi

ముంబై: ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ ముగింపుతో పాటు యూఎస్‌ ఫెడ్‌ మినిట్స్‌ వెల్లడి నేపథ్యంలో ఈ వారంలోనూ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. అయితే పరిమిత శ్రేణికి లోబడే ట్రేడింగ్‌ ఉండొచ్చంటున్నారు. దేశీయ సూచీలు ప్రపంచ మార్కెట్ల తీరును అనుసరించే వీలుందంటున్నారు. ఇదే వారంలో ఐదు కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్‌ ఇండెక్స్, యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరల కదలికల అంశాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.  

‘‘సుధీర్ఘ ర్యాలీ తర్వాత సూచీలు స్థిరీకరణ దశలో ఉన్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.., గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదు. కమోడిటీ ధరలు దిగిరావడం, కేంద్ర బ్యాంకులు సరళతర ద్రవ్య విధాన వైఖరితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి డిమాండ్‌ మరింత పెరగొచ్చు. నిఫ్టీ కీలకమైన తక్షణ మద్దతు 18,300 స్థాయిని నిలుపుకోగలిగింది. కొనుగోళ్లు కొనసాగితే 18,400–18,450 శ్రేణిలో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే 18,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో గతవారంలో సూచీలు స్వల్ప నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ 132 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి.   

ప్రపంచ పరిణామాలు  
యూరో జోన్‌ సెప్టెంబర్‌ కరెంట్‌ ఖాతా లోటు డేటా రేపు(మంగళవారం) విడుదల అవుతుంది. యూఎస్, బ్రిటన్, యూరో జోన్‌ దేశాల నవంబర్‌ తయారీ, సేవా రంగ డేటా ఎల్లుండి(బుధవారం) వెల్లడి కానుంది. మరుసటి రోజున గురువారం(ఈ నెల 24న) అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ మినిట్స్‌ విడుదల అవుతాయి. ఈ సందర్భంగా ఫెడ్‌ రిజర్వ్‌ అధికారుల వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక
అంచనాకు రావచ్చు.

ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ  
ఈ గురువారం(జూలై 28న) నిఫ్టీ సూచీకి చెందిన నవంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్‌ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్‌ ఆఫ్‌ లేదా రోలోవర్‌ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్‌ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.  

విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు  
ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి స్థిరత్వంతో పాటు వృద్ధి విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మెరుగ్గా ఉందనే సానుకూల అంశాలతో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున దేశీయ ఈక్విటీలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నవంబర్‌లో ఇప్పటి వరకు(1–17 తేదీల మధ్య) రూ.30,385 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఎఫ్‌ఐఐలు తమ బుల్లిష్‌ ధోరణిని కొనసాగిస్తే సూచీలు సులభంగా జీవితకాల గరిష్టాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ‘‘భారత కంపెనీల షేర్ల వ్యాల్యుయేషన్లు అధిక స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతున్నందున రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్‌ పట్ల బేరిష్‌ వైఖరిని ప్రదర్శించవచ్చు. ఇదే సమయంలో చైనా, దక్షిణ కొరియా, తైవాన్‌ స్టాకులు ఆకర్షణీయమైన ధరల వద్ద లభ్యమవుతున్న తరుణంలో ఎఫ్‌ఐఐలు ఈ దేశాల వైపు మెగ్గుచూపవచ్చు’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌ కుమార్‌ తెలిపారు.   

ఈ వారంలో అయిదు లిస్టింగ్‌లు  
ఇటీవల ఐపీఓను పూర్తి చేసుకున్న అయిదు కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. ప్రత్యేక రసాయనాలు తయారు చేసే ఆర్కియన్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్, బ్యాంకింగేతర రంగ ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ షేర్లు నేడు(సోమవారం) ఎక్చ్సేంజీల్లో నమోదుకానున్నాయి. గ్రే మార్కెట్లో ఆర్కియన్‌ కెమికల్‌ షేర్లు 25% ప్రీమియంతో, ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ డిస్కౌంట్‌తో ట్రేడవుతున్నాయి. కేన్స్‌ టెక్నాలజీస్‌ ఇండియా షేర్లు మంగళవారం, ఐనాన్స్‌ గ్రీన్‌ ఎనర్జీ సర్వీసెస్‌ షేర్లు బుధవారం, కీస్టోన్‌ రియల్టర్స్‌ షేర్లు గురువారం లిస్ట్‌ కానున్నాయి. వీటిలో ఎలక్ట్రానిక్స్‌ పరికరాల ఉత్పత్తి సంస్థ కేన్స్‌ టెక్నాలజీస్‌ 30శాతం ప్రీమియంలో.., మిగతా రెండు కంపెనీ షేర్లు ఇష్యూ ధరల వద్ద స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో లిస్టింగ్‌ల తీరును ఇన్వెస్టర్లు గమనించవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement