
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోతో ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్ తీవ్ర దుమారం రేపుతోంది.
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఇచ్చిన ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భారీగా ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెబుతూ ఓ ఇంటి ముందు ఒక మహిళ నిలబడి ఉన్న ఫొటోను ప్రకటనగా చేసి ప్రచురించారు. ప్రధాన పత్రికలతో పాటు సోషల్ మీడియాలో ఆ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
ప్రకటనలో ఉన్న మహిళ పేరు లక్ష్మిదేవి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలోని బౌబజార్‌లో మలాంగలో ఆమె నివసిస్తోంది. ‘ఆమె ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా లక్ష్మీదేవికి ఇల్లు వచ్చింది’ అని ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనను చూసిన లక్ష్మి షాక్‌కు గురైంది. ఆ ఫొటో ఎవరూ తీసుకున్నారో.. ఎప్పుడు తీసుకున్నారో తెలియదని మీడియాకు చెప్పింది. ఇంకా ఆమె చెప్పిన వివరాలు తెలుసుకుంటే అవాక్కయ్యే పరిస్థితి.
లక్ష్మీదేవి ఉండేది అద్దె ఇంట్లో. అది కూడా ఒకే ఒక గది ఉన్న ఇంటిలో కుటుంబసభ్యులు మొత్తం ఆరుగురు ఉంటారు. ఆ ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేదు. ఉంటున్న గదికి నెలకు రూ.500 అద్దెగా చెల్లిస్తున్నారు. బాబుఘాట్‌లో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వెళ్లామని.. అప్పుడు ఆ ఫొటో తీసి ఉండొచ్చని లక్ష్మి తెలిపింది. తాను చదువుకోలేదని.. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని పేర్కొంది. తనను బీజేపీ నాయకులు ఎవరు కలవలేదని చెప్పింది.
ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ నాయకుడు రాహూల్ గాంధీ కూడా స్పందించి దానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. మళ్లీ మళ్లీ అబద్ధాలు చెప్పడానికి కూడా జ్ఞానం ఉండాలి అని ట్వీట్ చేశారు. ఈ అబద్ధపు ప్రచారంపై తృణమూల్ కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇవ్వడాన్ని తృణమూల్ కాంగ్రెస్ తప్పు పట్టింది.
बार-बार दोहराने पर भी, झूठ झूठ ही रहता है!#FactCheck pic.twitter.com/yvl6tf7yCW
— Rahul Gandhi (@RahulGandhi) March 22, 2021