
తిరువనంతపురం: కేరళలో బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. ఓ అగంతకుడు రాష్ట్రంలోని ప్రముఖ ప్రాంతాల్లో బాంబుల్ని ఏర్పాటు చేసినట్లు బెదిరింపులకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది.
సోమవారం ఉదయం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం జిల్లా కోర్టుకు అధికారిక ఈ-మెయిల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. సీఎం పినరయి విజయన్‌తో పాటు తిరువనంతపురం జిల్లా కోర్టులో బాంబును పెట్టామనేది ఆ మెయిల్ సారాంశం. సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసం,జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో
బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్) జాగిలాలతో మోహరించింది. కోర్టు లోపల, పరిసర ప్రాంతాలు, సీఎం అధికారిక నివాసంలో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబులు ఇతర అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కోర్టు అధికారిక మెయిల్‌కు బాంబు బెదిరింపులు మెయిల్స్ పంపిన అగంతకుడిని గుర్తిస్తామని అన్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
28సార్లు బాంబు బెదిరింపులు
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కేరళ రాష్ట్రానికి 28 సార్లు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు చెప్పారు. సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసంతో పాటు రాజ్‌భవన్,ఎయిర్‌పోర్టు,కోర్టులలో బాంబులను అమర్చామని మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు అధికారికంగా విడుదల చేసిన నోట్‌లో పేర్కొన్నారు.