ఉడుకుతున్న ఉత్తరాది | Sakshi
Sakshi News home page

ఉడుకుతున్న ఉత్తరాది

Published Wed, May 29 2024 4:12 AM

Temperature in Delhi almost touches 50 degrees C mark

ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

న్యూఢిల్లీ/కొచ్చి: ఆదిత్యుని ఆగ్రహ కిరణాలకు ఉత్తరభారతం ఎండలతో భగభగ మండుతోంది. వడగాలులు తోడవడంతో వేసవికాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో మంగళవారం దాదాపు 50 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ముంగేశ్‌పూర్, నరేలా ప్రాంతాల్లో 49.9 డిగ్రీ సెల్సియస్, నజఫ్‌గఢ్‌లో 49.8 డిగ్రీ సెల్సియస్‌  ఉష్ణోగ్రత రికార్డయింది. ఇది ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత కంటే 9 డిగ్రీసెల్సియస్‌ ఎక్కువ ఉండటం గమనార్హం.

ఉత్తర ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, పంజాబ్‌లోనూ ఎండలు ఇలాగే మండిపోయాయి. రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 50.5 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత కంటే 7 డిగ్రీ సెల్సియస్‌ ఎక్కువ. హరియాణాలోని సిర్సాలో 50.3, హిసార్, పంజాబ్‌లోని భటిండాలో 49.3, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పట్టణంలో 49, ప్రయాగ్‌రాజ్‌లో 48.2, వారణాసి, కాన్పూర్‌లో 47.6 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్‌లోనూ నాలుగైదు ప్రాంతాల్లో 48 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రత రికార్డయింది.  

కేరళలో భారీ వర్షాలు 
ఉత్తరాది ప్రజలు ఉక్కపోతతో చెమట చిందిస్తుంటే దక్షిణాదిన కేరళలో భారీ వర్షాలతో ప్రజలు తడిసి ముద్దయ్యారు. ఈదురుగాలులతో కూలిన భారీ వర్షం కేరళ దక్షిణ, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేసింది. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు కూలిపోయాయి. దీంతో కొందరు పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారు. చాలా జిల్లాల్లో పర్యాటక కేంద్రాలను మూసేశారు. కొండ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిషేధించారు.

కొచ్చి సిటీ, ఎర్నాకులం జిల్లాల్లో గంటల తరబడి వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొచ్చిలోని కలమసెర్సీ ప్రాంతంలో వందలాది ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. మీనాచిల్, కొల్లియార్‌ నదుల్లో నీటిమట్టాలు పెరిగాయి. అరవిక్కర, మలాంకర డ్యామ్‌ల గేట్లను స్వల్పంగా ఎత్తారు. జలాశయాలు ఉప్పొంగడంతో శివారు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. తిరువనంతనపురంలోని ముథలపోజీ తీరం వద్ద భారీ అల కారణంగా పడవ బోల్తాపడి మత్స్యకారుడు చనిపోయాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement