కొత్త పార్లమెంట్‌ కాంట్రాక్టు టాటాలకే

Tata Projects Ltd wins bid to construct new Parliament building - Sakshi

రూ.861.9 కోట్లతో బిడ్‌ వేసి గెల్చుకున్న టాటా ప్రాజెక్ట్స్‌

సెంట్రల్‌ విస్టా రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ కింద నిర్మాణం

న్యూఢిల్లీ: కొత్తగా కట్టే పార్లమెంట్‌ భవనాల నిర్మాణ బాధ్యతలను టాటా ప్రాజెక్ట్స్‌ బుధవారం గెలుచుకుంది. కొత్తగా పార్లమెంట్‌ భవన సముదాయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకొని బిడ్లు ఆహ్వానించింది. ఇందుకోసం టాటా ప్రాజెక్ట్స్‌ రూ. 861.90 కోట్లతో బిడ్‌వేయగా, ఎల్‌అండ్‌టీ రూ. 865 కోట్లకు బిడ్‌ ధాఖలు చేసింది. దీంతో ప్రాజెక్టును టాటాలకు ఖరారు చేశారు. ప్రస్తుత పార్లమెంట్‌కు దగ్గరోనే సెంట్రల్‌ విస్టా రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ కింద కొత్త భవనాలు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక కొత్త పార్లమెంట్‌ భవనం, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ భవనం నిర్మించడమే కాకుండా రాజ్‌పథ్‌ రోడ్‌ను మెరుగుపరుస్తారు. అంతేకాకుండా ప్రధాని నివాసం, కార్యాలయాలను సౌత్‌బ్లాక్‌ దగ్గరకు, ఉపరాష్ట్రపతి నూతన నివాసాన్ని నార్త్‌బ్లాక్‌ దగ్గరలోకి మారతాయి.

గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ సంస్థ ప్రాజెక్టు నిర్మాణాల ఆర్కిటెక్చర్‌ను సమకూరుస్తోంది. ప్రాజెక్టు కోసం ప్రస్తుత ఉపరాష్ట్రపతి నివాస బంగ్లా, ఉద్యోగ భవన్, కృషి భవన్, శాస్త్రీ భవన్‌ తదితరాలను కూల్చనున్నారు. 21 నెలల్లో పార్లమెంట్‌ నిర్మాణం పూర్తవుతుందని అంచనా. అయితే ఇంకా నిర్మాణ ఆరంభ తేదీని నిర్ణయించలేదు. పార్లమెంట్‌ హౌస్‌ ఎస్టేట్‌లోని ప్లాట్‌ నంబర్‌ 118లో ఈ భవన నిర్మాణం జరుగుతుందని సీపీడబ్లు్యడీ తెలిపింది. కొత్త భవనాలు పూర్తయ్యేవరకు పాత భవనాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తారు. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ అనంతరం లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల సంఖ్య పెరుగనుంది. కొత్త పార్లమెంట్‌ భవనంలో దాదాపు 1400 మంది ఎంపీలు కూర్చునే వీలుంటుంది. ఈ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతం ల్యూటెన్‌ ఢిల్లీలో ఉంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top