Chennai: అదే జరిగితే మరో 80 ఏళ్లలో చెన్నై, తూత్తుకుడి..

Tamilnadu: UNO NASA Warns Climate Change Affect Coastal Areas Chennai - Sakshi

­­­పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రమట్టాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కాలుష్య కారకాలను తక్షణం తగ్గించుకో కుంటే మరో 80 ఏళ్లలో చెన్నై, తూత్తుకుడికి ముప్పు.. పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి, నాసా శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరించారు. ఈ విషయంలో ఏమాత్రం ఏమరపాటు తగదని సూచించారు.  

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘కడలి కన్నెర్ర చేసి.. చెన్నై, తూత్తుకూడి సహా దేశంలోని 12 సముద్రతీర నగరాలను మింగేసే అవకాశం ఉంది జాగ్రత్త..’ అంటూ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా కేంద్రం.. ‘నాసా’, ఐక్యరాజ్యసమితి తీవ్ర స్వరంతో హెచ్చరించాయి. ఈ మేరకు ఇటీవల ప్రకటన విడుదల చేశాయి. శీతోష్ణతిలో వస్తున్న అనూహ్య మార్పులకు అడ్డుకట్ట వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మరో 80 ఏళ్లలో దేశానికి ముప్పుతప్పదని అప్రమత్తం చేశాయి.  

శీతోష్ణస్థితి మార్పుల వల్ల భూమి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నట్లు అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు తరచూ గుర్తిస్తూనే ఉన్నాయి. మానవుల వ్యవహారశైలి వల్ల రాబోయే పదేళ్లలోపు భూమి ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్షియస్‌కు పెరిగే అవకాశం ఉంది. ఈ వేడిమి కారణంగా మంచు కొండలు పగిలిపోవడం, సముద్రపు నీటిమట్టం పెరిగిపోవడం, ఉష్ణోగ్రతతో కూడిన అలల తాకిడి పెరుగుదల, దుర్భిక్షం, కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

రాబోయే 2100 సంవత్సరంలో అంటే మరో 80 ఏళ్లలో మనదేశంలోని సముద్రతీరంలో ఉన్న 12 నగరాలు కడలిగర్భంలో 2.7 మీటర్ల లోతుల్లోకి మునిగిపోవచ్చని నాసా అంచనా వేసింది. ఈ 12 నగరాల్లో తమిళనాడుకు పరిధిలోని చెన్నై, తూత్తుకూడి ఉన్నాయి. ఈ మేరకు రక్షణ చర్యలను తక్షణం ప్రారంభించాలని సూచించింది. నిర్లక్ష్యం చేస్తే 2100 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల ప్రజలు ముంపు బాధితులుగా మిగులుతారని స్పష్టం చేసింది. దేశంలోని నాలుగు హార్బర్‌ నగరాలతోపాటూ ప్రపంచం మొత్తం మీద 45 హార్బర్‌ నగరాల్లో సముద్రనీటి మట్టం 50 సెంటీమీటర్ల ఎత్తుకు పెరిగి వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది.

ఏటికేడు ఈ ప్రమాద పరిస్థితులు పెరుగుతున్నందున లోతట్టు సముద్రతీర నగరాలు, దీవులు ఆపాయానికి చేరువ అవుతున్నాయని హెచ్చరించింది. ఉష్ణోగ్రత పెరుగుదలను తగ్గించే చర్యలను ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికైనా చేపట్టకుంటే సముద్రంలో నివసించే జీవులు నశించిపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని తేల్చింది. సీ ఫుడ్స్‌ అంతరించి పోతాయి. పెద్దసంఖ్యలో తుపానులు తీరాలను తాకవచ్చు. 1982–2016 మధ్యకాలంలో సుముద్రజలాల ఉష్ణోగ్రత రెట్టింపు అయ్యింది. రాబోయే వందేళ్లలోగా సముద్రపు నీటి మట్టం 30–60 సెంటీమీటర్ల ఎత్తుకు పెరుగుతుందని ఈసంస్థలు నిర్దిష్టమైన అంచనా వేసింది.

చదవండి: వాహనదారులకు తీపి కబురు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top