తమిళ పీఠం: ‘2021’ సీన్‌ రిపీట్ ? షాకిస్తున్న సీక్రెట్ సర్వే? | Tamil Nadu How the State Voted in the Previous Election | Sakshi
Sakshi News home page

తమిళ పీఠం: ‘2021’ సీన్‌ రిపీట్ ? షాకిస్తున్న సీక్రెట్ సర్వే?

Mar 25 2026 7:48 AM | Updated on Mar 25 2026 7:59 AM

Tamil Nadu How the State Voted in the Previous Election

ద్రవిడ గడ్డపై సంచలన రాజకీయాలకు తెరలేచింది. 2026 ఏప్రిల్‌లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో  రాజకీయ పార్టీల, నేతల వ్యూహ ప్రతివ్యూహాలు  మరింత పదునెక్కాయి. కుల సమీకరణలు, సంక్షేమ పథకాల హామీలు, పొత్తుల లెక్కలతో చెన్నైలోని వార్ రూమ్‌లు హోరెత్తిపోతున్నాయి. మరికొద్ది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి తమిళనాట గతంలో ఎన్నడూ లేని విధంగా ‘చతుర్ముఖ పోటీ’ నెలకొంది. అధికార డీఎంకే (డీఎంకే) కూటమి, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (ఏఐడీఎంకే) కూటమిలతో పాటు, స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే), సీమాన్ సారథ్యంలోని ‘నామ్ తమిళర్ కట్చి’ (ఎన్‌టీకే)లు ఎన్నికల బరిలోకి దిగాయి. 2026 తమిళనాడు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో  అనేది అంచనా వేయాలంటే, 2021 నాటి ఓటర్ల నాడిని విశ్లేషించడం అవసరం. ఈ నేపధ్యంలోనే ‘లోకనీతి-సిఎస్డీఎస్’ నిర్వహించిన సర్వే గణాంకాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.

2021 తీర్పు: గణాంకాలు ఏం చెబుతున్నాయి?
పదేళ్ల ఏఐఏడీఎంకే పాలనకు స్వస్తి పలికి.. ఎంకే స్టాలిన్‌ను ముఖ్యమంత్రిని చేసిన 2021 ఎన్నికల్లో ప్రధానంగా ద్విముఖ పోరు సాగింది. ఆ ఎన్నికల్లో డీఎంకే 39.1 శాతం ఓట్లను సాధించగా, ఏఐఏడీఎంకే 34.1 శాతంతో సరిపెట్టుకుంది. కూటముల పరంగా చూస్తే డీఎంకే కూటమికి 45.4 శాతం, ఏఐఏడీఎంకే కూటమికి 39.7 శాతం ఓట్లు వచ్చాయి. అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచిన సంఖ్య 6.6 శాతం. ఇది సీమాన్ నేతృత్వంలోని ఎన్‌టీకే (ఎన్‌టీకే) సాధించిన ఓట్ల శాతం. ఇక కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ (ఎంఎన్‌ఎం)2.6 శాతం, టీటీవీ దినకరన్ ‘ఏఎంఎంకే’ 2.5 శాతంతో తమ ఉనికి చాటుకున్నాయి.

వారసత్వ పోరులో ‘స్టాలిన్’ టాప్
నాడు జయలలిత, కరుణానిధి లేని తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో వారసత్వంపై ఓటర్లు స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 78.2 శాతం మంది ఓటర్లు కరుణానిధి అసలైన వారసుడు స్టాలినే అని తేల్చిచెప్పారు. అటు ఏఐఏడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌)కి 47.4 శాతం మంది మద్దతు లభించగా, ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్‌) కేవలం 8.9 శాతానికే పరిమితమయ్యారు. ఇటీవలే ఓపీఎస్‌ తన కుమారుడితో పాటు డీఎంకేలో చేరడం ఆసక్తికరంగా మారింది.

డబుల్ ఇంజిన్ సర్కార్‌పై వ్యతిరేకత?
హిందీ బెల్ట్ రాజకీయాలకు భిన్నంగా తమిళనాడు తన ప్రత్యేకతను చాటుకుంటూవస్తోంది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తమిళ ఓటర్లు 2021లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. 51.9 శాతం మంది కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయగా, 47.5 శాతం మంది కేంద్రంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలో ఉండాలి అనే (డబుల్ ఇంజిన్) వాదనను తిరస్కరించారు. బీజేపీ  ఎదుగుదల రాష్ట్ర సామాజిక ఐక్యతకు కీడు అని 40.3 శాతం మంది అభిప్రాయపడటం గమనార్హం.

సంక్షేమం  వెర్సస్‌ అవినీతి
గత ఏఐఏడీఎంకే ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, విద్యుత్, తాగునీరు తదితర రంగాల్లో మంచి మార్కులే సాధించినప్పటికీ (53.5 శాతం సంతృప్తి), అవినీతి ఆ పార్టీ కొంపముంచింది. 67.3 శాతం మంది ప్రజలు ఏఐఏడీఎంకే పాలనలో అవినీతి పెరిగిందని భావించారు. మరోవైపు తమిళనాడు సంక్షేమ పథకాలు (ఉచిత పాలు, సైకిళ్లు, అమ్మ క్యాంటీన్లు) ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. వీటిలో 70 నుంచి 85 శాతం మంది లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికే క్రెడిట్ ఇచ్చారు.

2026 పొత్తుల చదరంగం
ప్రస్తుతం డీఎంకే తన మిత్రపక్షాలైన కాంగ్రెస్ (28 సీట్లు), సీపీఐ (5), ఎండీఎంకే (4) వంటి పార్టీలతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న ఏఐఏడీఎంకే, బీజేపీలు తిరిగి ఒక్కటయ్యాయి. కానీ పార్టీల చీలికలు ఈ కూటమిని వేధిస్తున్నాయి. ఈ గ్యాప్‌లో నటుడు విజయ్ తన ‘టీవీకే’ పార్టీతో చక్రం తిప్పాలని చూస్తున్నారు. డీఎంకే వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా ఆయన ఒంటరిగా 234 స్థానాల్లో పోటీకి దిగారు.

నిర్ణయాత్మక శక్తి ఎవరు?
తమిళ ఓటరు చాలా తెలివైనవాడు. 23 శాతం మంది ఓటర్లు పోలింగ్ రోజే ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయించుకుంటారనే మాట వినిపిస్తుంది. కులం, మతం కంటే పార్టీ గుర్తుకే (53.3%) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ సారి ఎన్నికల్లో ‘జెన్ జెడ్’ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ఈ నేపధ్యంలో స్టాలిన్ తన కోటను కాపాడుకుంటారా? ఎడప్పాడి తిరిగి పుంజుకుంటారా? లేక విజయ్ ‘తమిళగ వెట్రి’ గెలుపు సాధిస్తారా? అనే ప్రశ్నలకు మే నెలలో వెలువడే ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి. 

ఇది కూడా చదవండి: పండుగలకు వంటగ్యాస్‌ సిలిండర్‌ ఉచితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement