కరోనా: దంపతుల గొప్ప​ మనసు.. స్వయంగా మాస్కులు కుట్టి.. | Tailor Auto Driver couples Stitch And Donate Masks In Tamil Nadu | Sakshi
Sakshi News home page

కరోనా: దంపతుల గొప్ప​ మనసు.. స్వయంగా మాస్కులు కుట్టి..

Apr 29 2021 12:58 PM | Updated on Apr 29 2021 2:07 PM

Tailor Auto Driver couples Stitch And Donate Masks In Tamil Nadu - Sakshi

సాయం చేయాలనే మనస్సు ఉండాలేగాని.. ఆర్థిక స్థోమత లేకపోయినప్పటికీ ఏదోరకంగా చేతనైన సాయం చేయవచ్చని చెన్నైకి చెందిన ఓ జంట చేతలద్వారా చెబుతోంది. స్వయంగా మాస్కులు కుట్టి ఉచితంగా పంపిణీ చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఛండీరా, కరుణాకరన్‌ దంపతులు. కరుణాకరన్‌ ఆటోడ్రైవర్‌గా పని చేస్తుంటే.. ఛండీరా కుట్టుమిషన్‌ మీద బట్టలు కుట్టి భర్తకు ఇంటిపనుల్లోనూ, ఆర్థిక వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా ఉంటుంది.

అయితే గతేడాది మనదేశంలో కరోనా కేసులు నమోదవ్వడం ప్రారంభమైనప్పుడు ‘‘మాస్క్‌ పెట్టుకోవడం తప్పనిసరి, మాస్కులేకుండా బయటికి తిరగకూడదు’’ అని విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఎక్స్‌పోర్టు కంపెనీలో టైలర్‌గా పనిచేస్తోన్న ఛండీరాకు.. ‘‘బట్టలు కుట్టగా ముక్కలుగా మిగిలిపోయిన క్లాత్‌ వృథాగా పోతుంది. వీటిని మాస్కులుగా కుడితే అందరికి ఉపయోగపడతాయి’’ కదా! అనిపించింది.

దీంతో తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మిగిలిపోయిన గుడ్డముక్కలతో మాస్కులు కుట్టి.. బంధువులు, ఇంటి చుట్టుపక్కల వారికి ఉచితంగా ఇచ్చేది. మాస్కులు నచ్చడంతో మాకు ఒకటివ్వారా! మా ఇంట్లో వాళ్లు అందరికీ కావాలి ఇస్తారా? అని అడిగేవారు. దీంతో ఛండీరా భర్త సాయం తీసుకుని మరిన్ని మాస్కులు కుట్టేది. కుట్టిన మాస్కులను కరుణాకరన్‌ ఆటో ఎక్కే ప్యాసింజర్లకు ఉచితంగా ఇచ్చేవాడు. అయితే మాస్కు తీసుకున్నవారు ‘‘ఎన్‌–95 మాస్కు పెట్టుకుంటే ఊపిరి సరిగ్గా ఆడడం లేదు. గుడ్డతో తయారు చేసిన మాస్క్‌లు ఏ ఇబ్బంది లేకుండా అనుకూలంగా ఉన్నాయి’’ అని చెప్పడంతో మరింత ప్రోత్సాహంతో ఎక్కువ మాస్కులు కుట్టేవారు.

‘‘ఒకపక్క ఎక్స్‌పోర్టు కంపెనీలో టైలర్‌గా పనిచేస్తూ.. మరోపక్క ఇంటి పనులు చక్కబెడుతూ కొంత సమయం కేటాయించి మాస్కులు కుడుతున్నాను. మధ్యాహ్నం భోజనం పదినిమిషాల్లో పూర్తిచేసి మిగతా సమయం అంతా మాస్కులు కుట్టేందుకు కేటాయిస్తున్నాను’’ అని ఛండీరా చెప్పారు. కరుణాకరన్‌ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా ఎన్ని మాస్కులు ఉచితంగా ఇచ్చామో ఎప్పుడూ లెక్కపెట్టలేదు. 500కి పైగా మాస్కులు పంచాము. నా ఆటోలో ఎక్కే ప్యాసింజర్లు ఎవరైనా మాస్కు పెట్టుకోవడం మర్చిపోతే విసుక్కోకుండా వారికి నా భార్య కుట్టిన మాస్కులు ఇస్తున్నాను’’ కస్టమర్లు కూడా మంచిగా స్పందిస్తున్నారు అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మనస్సు ఉంటే మార్గం ఉంటుందన్న మాటకు ఈ దంపతులు ఉదాహరణగా నిలుస్తున్నారు!
చదవండి: కరోనా పేషంట్లకు వండిపెడుతోన్న తల్లీకూతుళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement