
తమిళనాడు సర్కార్‌పై సుప్రీం కన్నెర్ర
మాజీ మంత్రి సెంథిల్ బాలాజీపై కేసులో వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీపై ఉన్న ‘క్యాష్ ఫర్ జాబ్స్’ఆరోపణల కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యమయ్యేలా చేస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే ఈ కేసులో నిందితులంటూ 2,300 మంది పేర్లను చేర్చిందని ఆరోపించింది. ఈ ప్రయత్నం న్యాయవ్యవస్థను మోసం చేయడమేనని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం అభివరి్ణంచింది. బాలాజీపై ఉన్న కేసుల పూర్తి వివరాలను తమ ఎదుట ఉంచాలని, బుధవారం విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
‘ఈ మొత్తం వ్యవహారంలో మంత్రితోపాటు మధ్యవర్తులుగా వ్యవహరించిందెవరు? మంత్రి సిఫారసులకు అనుకూలంగా పనులు చేసిన అధికారులెవరు? ఉద్యోగాల ఎంపిక కమిటీ సభ్యులెవరు? నియామక ఉత్తర్వులు వెలువరించిన అధికారులెవరు? వంటి వివరాలను తెలపాలని ధర్మాసనం కోరింది. బాలాజీ జీవిత కాలంలో కూడా విచారణ పూర్తి కాకుండా చేయడమే ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తోందని పేర్కొంది. మాజీ మంత్రి, ఆయన అనుచరులు ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించమని బలవంతం చేసిన పేదలను లంచం ఇచ్చేవారిగా, ఈ కుంభకోణం కేసులో నిందితులుగా చేర్చారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘క్యాష్ ఫర్ జాబ్స్’కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టుకొట్టివేయడంతో వై.బాలాజీ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టింది. ఏఐఏడీఎంకే హయాంలో 2011–2015 మధ్య కాలంలో మంత్రిగా పనిచేసిన సెంథిల్ బాలాజీ ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో తమిళనాడు పోలీసులు 2018లో మూడు కేసులు నమోదు చేశారు.
దీనిపై 2021 ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసి, 2023 జూన్‌లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసింది. 2024 ఫిబ్రవరిలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 15 నెలలపాటు జైలులో ఉన్న బాలాజీకి సుప్రీంకోర్టు 2024 సెపె్టంబర్‌లో బెయిలిచ్చింది. అదే నెలలో బాలాజీ మళ్లీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, బెయిల్ కావాలో పదవి కావాలో తేల్చుకోవాలని కొరడా ఝళిపించడంతో గతేడాది ఫిబ్రవరిలో పదవి నుంచి వైదొలిగారు.