పరిహారం చెల్లించాల్సిందే

Supreme Court order to AP on Purushottapatnam and Pattiseema - Sakshi

పురుషోత్తపట్నం, పట్టిసీమలపై ఏపీకి సుప్రీంకోర్టు ఆదేశం 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో నిర్మాణమైన పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) సంయుక్త కమిటీ సిఫార్సు చేసిన నష్టపరిహారాన్ని చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ ఆదేశించిన రూ.120 కోట్ల పరిహారం చెల్లింపుపై తరువాత విచారిస్తామని తెలిపింది.

పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల పర్యావరణ ఉల్లంఘనలపై జమ్ముల చౌదరయ్య, పెంటపాటి పుల్లారావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ ప్రాజెక్టు వ్యయం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు సంయుక్త కమిటీ పోలవరం ప్రాజెక్టును మినహాయించి పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రూ.2.48 కోట్లు పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1.90 కోట్లు నష్టపరిహారంగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4.38 కోట్లు భారం పడింది.

ఎన్జీటీ ఆదేశాలు సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.  ప్రతివాదుల న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని, పురుషోత్తపట్నం రైతులకు పరిహారం ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.  రెండువారాల సమయం ఇవ్వాలని ఏపీ న్యాయవాది కోరారు. రెండువారాల్లో జరిమానా చెల్లించారా లేదా అనే అంశంపై నివేదిక అందజేయాలని, లేకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ మూడువారాల తర్వాత చేపడతామని తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top