
సుప్రీంకోర్టు జడ్జి సూర్యకాంత్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం కూడా ఆలస్యమవుతోందని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేసుల పరిష్కారానికి ఒకప్పుడు సత్వరమైన ప్రత్యామ్నాయంగా ఉన్న మధ్యవర్తిత్వానికి నేడు మితిమీరిన వాయిదాల జాఢ్యం అంటుకుందని వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వం అంశంలో ప్రపంచంలోనే ప్రముఖంగా నిలవాలని భావిస్తున్న భారత్ కేవలం తీర్పుల సంఖ్యతోనే కాదు, ఆ తీర్పుల్లో తార్కికమైన ప్రమాణాలను, నిష్పాక్షికతను ప్రతిబింబించాలన్నారు.
మధ్యవర్తిత్వ తీర్పుల్లో జాప్యాన్ని నివారించేందుకు ఇరుపక్షాలు కట్టుబడి ఉండాల్సిన నమూనా విధివిధానాలు వంటి సంస్థాగత పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వాయిదాలను కఠినంగా నియంత్రించడం ఈ సమస్యకు ఒక పరిష్కారమని తెలిపారు. మధ్యవర్తిత్వ విధాన సమగ్రతను కాపాడేందుకు క్రమశిక్షణ ఎంతో అవసరమని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. వాణిజ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వ విధానం నేడు వెన్నెముకగా మారిందని చెప్పారు.