
నూతన సీజేఐ జస్టిస్ గవాయ్ పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంది
సుప్రీంకోర్టు విలువలు, ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ సూత్రాలను పరిరక్షిస్తారు: చీఫ్ జస్టిస్ ఖన్నా
ఘనంగా వీడ్కోలు
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో సుదీర్ఘకాలం పనిచేసి ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు సొంతం చేసుకున్నానని జస్టిస్ సంజీవ్ ఖన్నా సంతోషం వ్యక్తంచేశారు. జీవితాంతం ఈ జ్ఞాపకాలు తనకు తోడుగా ఉంటాయని చెప్పారు. తన సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ కాలం ముగియడంతో మంగళవారం ఆయనకు లాంఛనంగా వీడ్కోలు పలికారు. సుప్రీంకోర్టులో నిర్వహించిన సెర్మోనియల్ బెంచ్‌లో జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సంజయ్ కుమార్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయ వ్యవస్థకు జస్టిస్ సంజీవ్ ఖన్నా అందించిన సేవలను వక్తలు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రసంగించారు. నూతన సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ పట్ల తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు విలువలు, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను ఆయన చక్కగా పరిరక్షిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. తనకు ఇన్నాళ్లూ అతిపెద్ద మద్దతుదారుడిగా నిలిచారని కొనియాడారు. జస్టిస్ గవాయ్ నాయకత్వాన్ని ఎంతగానో విశ్వసిస్తున్నానని, రాజ్యాంగ విలువల పట్ల ఆయన అంకితభావం తిరుగులేనిదని వెల్లడించారు. తాము దాదాపు ఒకేసారి న్యాయమూర్తులుగా పదోన్నతి పొందామని, కొలీజియంలో కలిసి పనిచేశామని చెప్పారు. తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ అద్భుతమైన సేవలు అందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
ఖన్నాతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం
సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా అందించిన సేవలను జస్టిస్ బి.ఆర్.గవాయ్ కొనియాడారు. ఇది వీడ్కోలు కాదని, ఒక మార్పు మాత్రమేనని చెప్పారు. జస్టిస్ ఖన్నా వృత్తి జీవితం ఈరోజుతో ఆగిపోవడం లేదని, మరొకదానికి ఇది ఆరంభమని వివరించారు. జస్టిస్ ఖన్నా ఆలోచల్లో స్పష్టత, నైతికత, ప్రాథమిక హక్కుల పరిరక్షణ పట్ల అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఆయన ఇచి్చన తీర్పులన్నీ రాజ్యాంగ విలువలతో కూడి ఉన్నాయని చెప్పారు. జస్టిస్ ఖన్నాతో ఇన్నాళ్లూ కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. జస్టిస్ ఖన్నా తమకు స్ఫూర్తిప్రదాత అని పేర్కొన్నారు.
అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి మాట్లాడుతూ... జస్టిస్ ఖన్నా న్యాయస్థానాల విలువ, గౌరవం ఎన్నోరెట్లు పెంచారని ప్రశంసించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం జస్టిస్ ఖన్నా సేవలను గుర్తుచేసుకున్నారు. కపిల్ సిబల్ మాట్లాడుతూ... ఈ వారం దేశంలో ఇద్దరు గొప్ప వ్యక్తులు పదవీ విరమణ చేశారని చెప్పారు. క్రికెటర్ విరాట్ కోహ్లీతోపాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా రిటైర్ అవుతున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో జస్టిస్ సంజీవ్ ఖన్నాకు మంగళవారం వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కపిల్ సిబల్ ప్రసంగించారు. రెండు దశాబ్దాలపాటు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ ఖన్నా న్యాయం పట్ల తిరుగులేని అంకితభావం కనబర్చారని చెప్పారు.