
శ్రీనగర్: శ్రీనగర్‌లో నేటి నుంచి జీ–20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశాలు మొదలవుతున్న విషయం తెలిసిందే. ఉగ్ర బెడద నేపథ్యంలో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తత ప్రకటించాయి. నేషనల్ సెక్యూరిటీ గ్రూప్(ఎన్‌ఎస్‌జీ) కౌంటర్ డ్రోన్ బృందాలు గగనతలంపై కన్నేసి ఉంచాయి. సుందర దాల్ సరస్సుపై నేవీ మెరైన్ కమాండోలు గస్తీ చేపట్టారు. పలు కీలక ప్రాంతాల్లో భారీగా మోహరింపులు, తనిఖీలు ముమ్మరమయ్యాయి.
వివిధ దేశాల నుంచి హాజరయ్యే 60 మంది ప్రతినిధులు, 20 మంది జర్నలిస్టుల కోసం సమావేశాల వేదికైన షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్‌కేఐసీసీ) వద్ద యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్‌ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశమిది. దీంతో, సమావేశ వేదికతోపాటు, వారు బస చేసే ప్రాంతం, ఆ పక్కనే ఉన్న జబర్వాన్ పర్వతశ్రేణిపై ఆర్మీ బలగాలను రంగంలోకి దించారు.
ఉగ్రమూకలు ఐఈడీలతో విధ్వంసానికి పాల్పడే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో సోదాలు ముమ్మరం చేశారు. పాక్ కేంద్రంగా పనిచేసే జైషేమొహ్మద్‌కు చెందిన ఓ వ్యక్తిని ఆదివారం కుప్వారా జిల్లాలో సోదాల సమయంలో బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సైన్యం కదలికల సమాచారాన్ని అతడు పాక్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించారు. పూంఛ్‌లో సరిహద్దులకు సమీపంలో మెంధార్ సెక్టార్ వద్ద అనుమానాస్పద కదలికలతో బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టాయి. సోదాలు పూర్తయ్యేదాకా ఎవరూ ఇల్లు వదిలి బయటకు రావద్దని ప్రజలను అధికారులు కోరారు.