
న్యూఢిల్లీ: మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. భారత సైన్యంలోనూ ప్రవేశించి, తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారిణి సోనాలి మిశ్రా.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. జూలై 31న పదవీ విరమణ చేయనున్న మనోజ్ యాదవ్ స్థానంలో ఆమె ఈ పదవిని చేపడుతున్నారు.
సోనాలి మిశ్రాను ఈ పదవిలో నియమించేందుకు క్యాబినెట్ నియామకాల కమిటీ అధికారికంగా ఆమోదం తెలిపింది. సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం 2026, అక్టోబర్ 31 వరకూ అంటే పదవీ విరమణ చేసే వరకు సోనాలి మిశ్రా ఈ పదవిలో కొనసాగనున్నారు. రైల్వే ఆస్తులను కాపాడటం, ప్రయాణికుల భద్రత తదితర విధులతో పాటు, వాటి బాధ్యతలను అధికారులకు అప్పగించే విషయంలో ఆర్పీఎఫ్‌కు సోనాలీ మిశ్రా తొలి మహిళా అధికారిగా విధులు నిర్వహించనున్నారు.
సోనాలి మిశ్రా మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిణి. ఆమె ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీసు విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ (సెలక్షన్)గా పనిచేస్తున్నారు. కాగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)1957లో పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటయ్యింది. దీనికి 1985, సెప్టెంబర్ 20న యూనియన్ సాయుధ దళం హోదా ఇచ్చారు. 2021 జూలైలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) ఏర్పాటుకు నాయకత్వం వహించిన మొదటి మహిళా కమాండర్‌గా సోనాలి మిశ్రా పేరొందారు.