బిల్లును అడ్డుకుని సంబరాలా? | smriti irani ramdas athawale takes on congress over women reservation bill | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌పై ధ్వ‌జ‌మెత్తిన ఎన్డీఏ నేత‌లు

Apr 18 2026 4:30 PM | Updated on Apr 18 2026 4:45 PM

smriti irani ramdas athawale takes on congress over women reservation bill

ఢిల్లీ: రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్‌స‌భ‌లో వీగిపోవ‌డంతో విప‌క్షాల‌పై అధికార ఎన్డీఏ నాయ‌కులు మండిప‌డుతున్నారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌కుండా అడ్డుకున్న విప‌క్షాల‌కు గుణ‌పాఠం త‌ప్ప‌ద‌ని హెచ్చరించారు. రాజ‌కీయ ప్రయోజ‌నాల కోసమే బిల్లు పాస్ కాకుండా అడ్డుకున్నార‌ని ఆరోపించారు. ఈ విష‌యంలో విప‌క్షాలు పెద్ద త‌ప్పు చేశాయ‌ని, దీనికి ఫ‌లితం క‌చ్చితంగా అనుభ‌విస్తాయ‌ని అన్నారు.

ఓడిన బిల్లు.. కాంగ్రెస్ సంబ‌రాలు: ఇరానీ
మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై కాంగ్రెస్ నాట‌కాలు ఆడుతోంద‌ని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ ధ్వ‌జ‌మెత్తారు. లోక్‌స‌భ‌లో మ‌హిళా బిల్లు వీగిపోతే కాంగ్రెస్ స‌భ్యులు బ‌ల్లలు చ‌రుస్తూ, న‌వ్వుతూ సంబ‌రాలు చేసుకున్నారని అన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసి, వారి హక్కులను  నిరాకరించడ‌మే కాకుండా సంబ‌రాలు చేసుకున్నార‌ని వాపోయారు. ఎన్నో ఏళ్లుగా రిజ‌ర్వేష‌న్ కోసం పోరాడుతున్న మ‌హిళ‌ల ఆకాంక్ష‌ల‌ను కాంగ్రెస్ కాల‌రాసిందని దుయ్య‌బ‌ట్టారు. రాజ్యాంగ వ్యవస్థ, పార్లమెంటుపైనే కాదు.. దేశంలోని మహిళలపైనా కాంగ్రెస్‌కు నమ్మకం లేదని పేర్కొన్నారు. అధికారం కోసం బీజేపీ ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌ని, సమానత్వ హక్కు కోసం ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టింద‌న్నారు.

మ‌హిళ‌లు త‌గిన జవాబిస్తారు: అథవాలే
మ‌హిళా బిల్లును అడ్డుకుని కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు పెద్ద తప్పు చేశాయ‌ని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే పేర్కొన్నారు. మహిళలకు న్యాయం చేయ‌కుండా విప‌క్షాలు అడ్డుప‌డ్డాయ‌ని విమ‌ర్శించారు. సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉన్నందుకే మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టారని వివ‌రించారు. ప్ర‌తిప‌క్షాల‌కు మహిళలు స‌రైన స‌మ‌యంలో తగినవిధంగా బుద్ధి చెబుతార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. దేశంలోని మహిళలు అంద‌రూ కాంగ్రెస్ పనితీరును చూశారని, ఆ పార్టీని వారు క్షమించబోరని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ పేర్కొన్నారు.

కుంటి సాకుల‌తో అడ్డుకున్నారు: చిరాగ్‌
లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదం పొందకుండా చేసిన ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు మ‌హిళ‌లు భవిష్యత్తులో త‌గిన జవాబు ఇస్తారని కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ నేత‌ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. కుంటి సాకుల‌తో విప‌క్షాలు మ‌హిళా బిల్లుకు మోకాలడ్డాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. "ఈ బిల్లును చదివిన ఎవరికైనా ఇంతకంటే మంచి ప్రతిపాదన మరొకటి ఉండదని అర్థమవుతుంది. మేము ముందుకు తెచ్చిన డీలిమిటేషన్ ప్రతిపాదనలో ప్రతి రాష్ట్రానికి సమాన వాటా ఇచ్చాం, సీట్లను సమానంగా పంపిణీ చేశాం. నిన్న లోక్‌స‌భ‌లో హోం మంత్రి అమిత్ షా కూడా అన్నీ స్పష్టంగా వివరించారు. ప్రతిపక్షం ఒకదాని తర్వాత ఒకటి సాకులు చెబుతూ బిల్లును అడ్డుకుంది. సగం జనాభాకు వారి హక్కులు దక్కడం వారికి ఇష్టం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ పార్లమెంట్ సమావేశాలను విని ఉంటారు, భవిష్యత్తులో వారు ప్రతిపక్షానికి తగిన జవాబు ఇస్తార"ని చిరాగ్ పాశ్వాన్ అన్నారు.

కాంగ్రెస్ ఖ‌తం ఖాయం: హిమంత శ‌ర్మ‌
మ‌హిళ‌ల ఆగ్ర‌హానికి గురైన కాంగ్రెస్ పార్టీ అంతమైపోతుందని అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిస్వా శ‌ర్మ (himanta biswa sarma) అన్నారు. లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదం పొంద‌కుండా అడ్డుకున్నందుకు రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులపై మ‌హిళ‌లు ఆగ్ర‌హంగా ఉన్నార‌ని చెప్పారు. విప‌క్ష నాయ‌కులు త‌మ‌ను అవ‌మానించార‌నే భావ‌న మ‌హిళ‌ల్లో బ‌లంగా ఉంద‌న్నారు. 

చ‌ద‌వండి: నాకు, మోదీకి భార్య‌ల స‌మ‌స్య లేదు.. రాహుల్ గాంధీ స‌ర‌దా కామెంట్స్‌

బాధ క‌లిగించింది: హేమమాలిని 
మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు లోక్‌స‌భ‌లో వీగిపోవ‌డం త‌న‌కెంతో బాధ క‌లిగించింద‌ని సీనియ‌ర్ న‌టి, బీజేపీ ఎంపీ హేమమాలిని అన్నారు. బిల్లు ఆమోదం కోసం తాము ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ విప‌క్షాలు అడ్డుప‌డ్డాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీ తీరుకు నిర‌స‌గా దేశ‌వ్య‌ప్తంగా మ‌హిళ‌లు ఆందోళ‌న‌లు చేస్తున్నార‌ని చెప్పారు. కాగా, ఢిల్లీలో బీజేపీ మ‌హిళా కార్య‌క‌ర్త‌లు నిర్వ‌హించిన నిర‌స‌న‌ కార్య‌క్ర‌మంలో హేమ‌మాలిని పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement