
ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌పై వీరోచిత పోరాటం
బీఎస్‌ఎఫ్ ఎస్‌ఐ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ వీరమరణం
వారి ప్రాణత్యాగాలను ప్రశంసిస్తూ గెజిట్ ప్రచురించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు చేసింది. ఉగ్రవాదుల స్థావరాలు, శిక్షణ కేంద్రాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఎంతోమంది ముష్కరులు అంతమయ్యారు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు సైతం ధ్వంసమయ్యాయి.
అంతిమంగా పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. అయితే, ఆపరేషన్ సిందూర్‌ను తిప్పికొట్టడానికి పాక్ సైన్యం ప్రయత్నించింది. డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. పాక్ దాడుల్లో భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) ఎస్‌ఐ మొహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాఖామ్ వీరమరణం పొందారు. మరణానంతరం వారికి వీర్ చక్ర పురస్కారం లభించింది. వారు చివరి వరకూ వీరోచిత పోరాటం సాగించారని, అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శించారని కేంద్రం ప్రభుత్వం ఈ నెల 4న ప్రచురించిన గెజిట్‌లో ప్రశంసించింది. ఈ ఏడాది మే 10న జమ్మూలోని ఖర్కోలాలో బోర్డర్ ఔట్‌పోస్టుపై పాక్ సైన్యం దాడికి దిగింది. డ్రోన్లు ప్రయోగించింది.
ఎస్‌ఐ ఇంతియాజ్ అక్కడే విధుల్లో ఉన్నారు. తన బంకర్ నుంచి బయటకు వచ్చారు. లైట్‌మెషిన్ గన్‌తో ఒక పాక్ డ్రోన్‌ను కూల్చివేశారు. కానిస్టేబుల్ దీపక్ మరో డ్రోన్‌ను నేలమట్టం చేశారు. ఇంతలో పాక్ భూభాగం నుంచి ఫిరంగి గుండు దూసుకొచ్చింది. ఎస్‌ఐ ఇంతియాజ్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ లేక్కచేయకుండా తన దళాన్ని ముందుకు నడిపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ తన సిబ్బందికి ఆదేశాలిచ్చారు. వారికి ప్రేరణ కల్పించారు. జవానో.. ఆజ్ ఖతం కరో ఇన్‌కో(సైనికులారా.. పాకిస్తాన్ ముష్కరులను అంతం చేయండి) అంటూ బిగ్గరగా అరిచారు. విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచారు. గాయపడిన కానిస్టేబుల్ దీపక్ సైతం ఆఖరి క్షణం వరకూ యుద్ధం సాగిస్తూనే మృతిచెందారు. ప్రభుత్వం వారిద్దరి ప్రాణత్యాగాన్ని గుర్తించింది. వీర్‌చక్రను ప్రదానం చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న 16 మంది బీఎస్‌ఎఫ్ జవాన్లకు పోలీస్ శౌర్య పతకాలు లభించాయి.